చలిలోనూ తగ్గని ప్రచార వేడి
జగిత్యాల: పంచాయతీల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాలో 385 పంచాయతీలు, 3,536 వార్డులున్నాయి. మొదటి విడత ఎన్నికలు గురువారంతో ముగిశాయి. రెండోవిడత ఈనెల 14న, మూడో విడత ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఓటరు నాడీ దొరకాలంటే అభ్యర్థులు ఆలోచించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులంతా తెలిసిన వారే కావడంతో ప్రతి ఒక్కరికి ఓటు వేస్తామని హామీ ఇస్తుంటారు. అందరికీ ఒకే రకమైన భరోసా ఇస్తూ.. ఎక్కడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులు కుల సంఘాలు, యూత్ సభ్యులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయినప్పటికీ గెలుపోటముల్లో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
మొదలైన టెన్షన్
పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్లలో కలవరం మొదలైంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 14న ఉండటంతో ప్రచారానికి కేవలం ఒకరోజు సమయం మాత్రమే ఉంది. మూడో విడత వారికి కొంత సమయం ఉంది. ఇన్ని రోజులు ఉపసంహరణలు, రెబల్స్‌ను బతిమిలాడుకోవడంతోనే సమయం పోగా, ఇక మిగిలిన సమయంతో ఓటర్లను గాలం వేసేలా చూస్తున్నారు. ఒక వైపు తాయిలాలు అందజేస్తూ సాయంత్రం పూట విందులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చ కొనసాగుతోంది. ఓటర్లు ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఎవరినీ అడిగినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. కొందరికై తే కార్లు, వెహికిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామపంచాయతీలో ఒక్క ఓటు సైతం కీలకం కావడంతో ఆరోజు ఎన్ని పనులు ఉన్నా వచ్చి ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థులు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం మిన్నంటింది. ఎన్నికలపై గ్రామాల్లో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది యువత మాత్రం ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎలాంటి వారికి ఓటు వేయాలి, మంచి వారిని ఎన్నుకోవాలంటూ సందేశాలు ఇస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిస్థితి నెలకొంది.
ఖర్చుకు ఆందోళన
రెండు, మూడో విడతకు మరికొంత సమయం ఉండటంతో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నిత్యం వందమందిని వెంటేసుకుని ప్రచారానికి తిరిగితే చాయ్‌లు, టిఫిన్లు, భోజనాలకు విపరీతంగా ఖర్చు పెరిగిపోతోంది. సాయంత్రం అయిందంటే కచ్చితంగా మందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
గుర్తులతో కష్టమే...
సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఇబ్బందికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల లాగా అభ్యర్థి ఫొటోలు ఉండవు. సర్పంచ్‌కు సంబంధించిన ఎన్నికల్లో గుర్తులు తికమకగానే ఉన్నాయి. టూత్‌పేస్ట్‌లు, ఉంగరాలు, గ్యాస్‌స్టౌవ్‌లు ఇలాంటి ఉండటంతో ఓటు వేసేవారు గుర్తు పెట్టుకుంటేనే ఓ టు వేయవచ్చు. పెద్దమనుషులు, మహిళలు వారికి ప్రత్యేకంగా వివరించాల్సి న అవసరం ఉంటుంది.
రెండు, మూడో విడతలకు అభ్యర్థుల ప్రచారం
ఓటర్లకు గాలం వేసేందుకు శతవిధాలా ప్రయత్నం
గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న వైనం


