జగిత్యాలటౌన్: శ్రీపాదరావు వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజలకు సేవచేయడం ద్వారా కీర్తిప్రతిష్టలు గడించారని తెలిపారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జీవాకర్‌రెడ్డి, డీఆర్‌డీవో రఘువరణ్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, డీపీఆర్వో నరేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు
జగిత్యాల:రంగుల పండగ హోలీ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ ఆనందోత్సవాల మధ్య పండగను జరుపుకోవాలని, జీవితం రంగుల హరివిల్లు కావాలని ఆకాంక్షించారు. సహజ రంగులతో పండుగ జరుపుకోవాలన్నారు. నీటి వృథాను నివారిస్తూ పర్యావరణాన్ని కాపాడేలా పండుగ చేసుకోవాలన్నారు.
సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 15 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
హోలీని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
హోలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బలవంతంగా రంగులు చల్లడం, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, గొడవలకు దిగడం చేయొద్దని సూచించారు. చెరువులు, కాలువలు, లోతైన నీటి కుంటల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.
జగిత్యాల కమిషనర్‌కు మెట్‌పల్లి బాధ్యతలు
మెట్‌పల్లి: జగిత్యాల బల్దియా కమిషనర్ స్పందనకు మెట్‌పల్లి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడి కమిషనర్ మోహన్ రెండురోజుల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. జగిత్యాల కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
నేడు చంద్రగ్రహణం
ధర్మపురి: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన డోలోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 6 గంటలకు నిర్వహించాల్సిన తెప్పోత్సవం, డోలోత్సవం ఉదయం ఆరు నుంచి 7గంటల వరకు మాత్రమే బ్రహ్మపుష్కరిణిలో నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దర్శనాలు ఉండవని, బుధవారం 5 గంటలకు సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని తెలిపారు.


