ఆద్యంతం.. ఉత్కంఠ భరితం
● జగ్గాసాగర్, వెల్లుల్ల మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు
● ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన జనం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్, వెల్లుల మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచే లెక్కింపు ప్రారంభమైనప్పటికీ ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. జగ్గాసాగర్ సర్పంచ్‌గా పుల్ల సాయగౌడ్(జగన్‌గౌడ్) గెలుపొందారు. తన సమీప అభ్యర్థి ముదాం నర్సయ్యపై 85 ఓట్ల మెజార్టీ సాధించారు. వెల్లుల సర్పంచ్‌గా గూడురు తిరుపతి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి గోపిగౌడ్‌పై 296 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆద్యంతం..ఉత్కంఠభరితం అన్నట్లుగా ఈ రెండు గ్రామాల్లోని ఎన్నికలు, ఫలితాల విషయంలో అదే తరహా జరగడం విశేషం.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
వెల్గటూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ అన్నారు. గురువారం వెల్గటూర్, అంబరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్‌తో కలిసి తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించారు. వెల్గటూర్, అంబరిపేట వైద్యాధికారులు తేజశ్రీ, లవకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదించాలి
జగిత్యాలటౌన్: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు సుముఖంగా ఉన్నందున ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉభయసభల్లో చర్చకు తెచ్చి ఆమోదం పొందేలా కృషి చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీ బిల్లుపై చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆర్.కృష్ణయ్యకు లేఖ రాశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు పాల్గొన్నారు.
7.5 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు గురువారం 7.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఎండపల్లి మండలం గుల్లకోటలో 7.5, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 8, ధర్మపురి మండలం నేరెళ్లలో 8.1, భీమారం మండలం మన్నెగూడెం, గోవిందారంలో 8.2, కథలాపూర్‌లో 8.2, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 8.5, రాయికల్‌లో 8.7, మల్లాపూర్‌లో 8.8, మల్యాలలో 8.8, మేడిపల్లిలో 8.9, జగిత్యాలలో 9 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి
జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎన్‌హెచ్ 563 అంబారిపేట, అంతర్గాం గ్రామాల వద్దౖ ఫ్లెవర్, అండర్ పాస్, ఎన్‌హెచ్–63 రోడ్‌లో అనంతారం వద్ద హైలెవల్ వంతెన, ఎన్‌హెచ్–61 రోడ్‌లో చల్‌గల్, సింగరావుపేట, ఇటిక్యాల వద్ద హైలెవల్ బ్రిడ్జి, బోర్నపల్లి, జగన్నాథపూర్ హైలెవల్ వంతెనకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఎంపీ స్పందించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.
ఆద్యంతం.. ఉత్కంఠ భరితం
ఆద్యంతం.. ఉత్కంఠ భరితం
ఆద్యంతం.. ఉత్కంఠ భరితం


