
వరద ముంపు ముప్పు
కోరుట్ల: కోరుట్లకు వరద ముంపు పొంచి ఉంది. భారీ వర్షం కురిస్తే పట్టణమంతా అతలాకుతలం కానుంది. గతేడాది వర్షాకాలంలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు పట్టణంలోని కొన్ని వార్డుల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడటం.. మరికొన్ని వార్డుల్లో పదుల సంఖ్యలో ఇళ్లు వరద నీటిలో మునగడం నిత్యావసర సరుకులు కొట్టుకుపోవడం వంటి దయనీయ పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా రానున్న వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కోరుట్లకు మరోసారి వరద ముంపు ప్రభావం తీవ్రత పెరగవచ్చన్న అందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాలనీలకు వర్షపు వరద నీటి ముంపు తిప్పలు తప్పించాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి.
వరద ముంపు పరేషాన్..
భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో కోరుట్ల మున్సిపాలిటీలో విలీనమైన ఎఖీన్‌పూర్ స్తంభాల చెరువు నీరు కంచరకుంట ద్వారా కోరుట్లలోని మద్దుల చెరువుకు చేరుతుంది. ఆ ప్రవాహం ఆదర్శనగర్, అయోధ్యపట్నం మీదుగా వెళ్తుంది. ప్రవాహం పెరిగితే ఈ రెండు ప్రాంతాలు నీటిమయంగా మారుతాయి. మద్దులచెరువులోకి చేరిన వరద మత్తడి దూకి అక్కడి నుంచి కింది ప్రాంతాలైన అయిలాపూర్‌రోడ్, ప్రకాశం రోడ్, ఝాన్సీరోడ్ కింది బాగాల్లో పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశాలున్నాయి. అక్కడి నుంచి కల్లూర్ రోడ్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి ఆనంద్‌నగర్, నక్కలగుట్ట ఏరియాల్లోనూ వరద నీటి ముంపు తీవ్రత ప్రభావం ఉంటుంది. గతేడాది ప్రకాశం రోడ్, ఝాన్సీ రోడ్, ఆనంద్‌నగర్ ఏరియాల్లో ఇళ్ల చుట్టూ వర్షపు నీరు చేరడం.. అక్కడ నివస్తున్న వారిని కొందరిని జేసీబీలతో ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. భారీ వర్షాలు కురిస్తే కోరుట్ల పట్టణ పైభాగంలో ఉన్న కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి, కోరుట్ల మండలం సంగెం, నాగులపేట ఏరియాల్లో ఉన్న వాగులు, చెరువులు మత్తళ్లు దూకి కోరుట్ల వాగులోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా కోరుట్ల వాగు పరిసరాల్లో ఉన్న గంగంపేట, అర్పత్‌పురా, కాగజ్‌నగర్ ఏరియాల్లో పెద్ద ఎత్తున నీటి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. గతేడాది గంగంపేట ఏరియాలో సుమారు 80 నివాసాలు పూర్తి స్థాయిలో వరదనీటి ప్రవాహంలో మునిగిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం ఇళ్ల నుంచి పరుగులు తీసిన విషయం తెలిసిందే. వరద ఉధృతి తగ్గే వరకూ ఇళ్ల సమీపంలోకి ఎవరూ వెళ్లలేని దుస్థితి. ఇళ్లలో ఉన్న నిత్యావసర సరుకులు, నగలు, డబ్బులు సామాన్లు కొట్టుకుపోయాయి.
నీటి మళ్లింపునకు చర్యలేవి..!?
కంచరకుంట నుంచి ఆదర్శనగర్ ఏరియాకు వర్షపు వరద నీరు మద్దుల చెరువుకు చేరే క్రమంలో నీటి మళ్లింపునకు అవకాశముంది. ఈ విషయంలో గతేడాది వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అఽధికారులు కలిసి నీటి మళ్లింపు కోసం మద్దుల చెరువు పక్క పెద్ద డ్రైనేజీ తవ్వించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు మద్దుల చెరువు మత్తడి దూకిన నీటి మళ్లింపు కోసం రేల్వే లైన్ ఏరియా నుంచి మరో డ్రైనేజీ నిర్మాణానికి సంకల్పించారు. కానీ ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరిచిపోయారు. మళ్లీ వర్షాలు కురిసి ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కొవాలన్న విషయంలో అవసరమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
ముందు జాగ్రత్తలు అవసరం
భారీ వర్షాలు కురిస్తే అంతే
ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం
వర్షపు వరద నీటితో ముంపునకు గురయ్యే ఏరియాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో అవసరమైన తాత్కాలిక ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.
– రవీందర్, బల్దియా కమిషనర్, కోరుట్ల

వరద ముంపు ముప్పు