
● రాయితీపై సాగు పరికరాలు ● ఏడేళ్ల తర్వాత నిధుల కేటాయింప
గొల్లపల్లి: వ్యవసాయ యాంత్రీకరణకు మోక్షం లభించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వ్యవసాయ పరికరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. పంట సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ దోహదపడుతుంది. 2025–26కుగాను జిల్లాకు 4,194 యూనిట్లకు రూ.3.11కోట్లు మంజూరు చేశారు. త్వరలో రైతులకు పరికరాలు అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు అందించేందు వ్యవసాయ పరికరాలను మహిళ రైతులతో పాటు, ఎస్సీ, ఎస్టీ, రైతులకు 50 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. మిగతా వారికి 40శాతంతో అందించనున్నారు. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు అందిస్తారు. స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో నడిచే వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రు, కలుపుతీసే యంత్రాలు, పవర్‌టిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రం తదితర వాటిని అందించనున్నారు.
ఎంపిక బాధ్యత కమిటీలదే
యాంత్రీకరణ పరికరాలు అందించేందుకు జిల్లా, మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీకి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా.. డీఏవో, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండలస్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు.
ఏడేళ్ల తర్వాత...
2017–18 వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాదిగాను నిధులు మంజూరు చేసింది. గతంలో రైతులకు వ్యవసాయం కోసం ట్రాక్టర్లు అందించేవారు. ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. అయితే గతంలో మాదిరిగా ట్రాక్టర్లు కూడా అందిస్తే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పలువురు అన్నదాతలు సూచిస్తున్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు
జిల్లాకు వచ్చిన పనిముట్లు
పనిముట్లు యూనిట్లు నిధులు(రూ.లక్షల్లో) సబ్సిడీ
బ్యాటరీ/ఫూట్/మ్యానువల్ ఆపరేటెడ్ 3106 31.06 1,000
పవర్ స్ప్రేయర్స్ 513 51.30 10,000
రోటోవేటర్ 174 87 50,000
సీడ్‌కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 43 12.90 30,000
డిస్క్‌హారో, కల్టివేటర్, ఎంబీఫ్లౌ, కేజీవీల్స్, రోటోఫ్లడర్స్ 226 45.20 20,000
బాండ్‌ఫార్మర్ 12 1.80 15,000
పవర్ వీడర్ 17 5.95 35,000
బ్రష్ కట్టర్ 41 14.35 35,000
పవర్ టిల్లర్స్ 25 25.00 1,00,000
స్ట్రాబ్‌బేలర్స్ 37 37.00 1,00,000