
ఇళ్లు శిథిలం.. పొంచి ఉన్న ప్రమాదం
జగిత్యాల: జిల్లాకేంద్రంలో పాత ఇళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియకుండా ఉంది. ఇప్పటికే నాలు గు రోజులుగా ముసురు వర్షం కురుస్తోంది. ఇళ్ల గోడలు తడిచిపోయి ప్రమాదకరంగా మారాయి. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే ఇంటిభాగం కొంతకొంత కూలుతోంది. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇళ్లను విడిచి పెట్టలేకపోతున్నారు అందులో ఉండే ప్రజలు. వందేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లలో ఇప్పటికీ అందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పెద్దగా ముప్పు ఉండదని, ఇలా ముసురులా పెడితేనే గోడలు తడిచిపోయి కూలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అది ఏ సమయంలో కూలుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని, ఖాళీ చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు పాత ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో గాంధీనగర్ సమీపంలో ఓ పాత ఇల్లు కూలిపోయి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. జిల్లాకేంద్రంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ప్రతి వర్షాకాలంలో అధికారులు ఇలాంటి ఇళ్లను గుర్తించి.. ఇళ్లలో ఉండేవారికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే పురాతన ఇళ్లలో ఉంటున్నవారు పేదవారు కావడం.. ఉండేందుకు ఇతర ప్రాంతాల్లో చోటులేకపోవడంతో అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రమాదం జరిగితేనేనా..?
శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలకు మరో చోట ఇల్లు కేటాయిస్తే వారు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రమాదం అని తెలిసినా కొందరు ఆ ఇంటిని సర్దుకుంటూ అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోచోట ఇల్లు కేటాయిస్తే వెళ్లేందుకు కొందరు ఉన్నారు. వర్షం కురిసినప్పుడల్లా ఇళ్లంతా ఉరవడం.. ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు స్పందించి పేదలకు గూడు కల్పించి పాత ఇళ్లను కూల్చివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాత ఇళ్లపై ఇంటి యజమానులకు అవగాహన కల్పించి కూలితే ప్రమాదం జరుగుతుందని చెప్పి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ భవనాలు కూల్చివేత
జిల్లా కేంద్రంలోని కొన్ని పాత స్కూళ్లు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలుంటే వాటిని అధికారులు కూల్చివేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అని ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు.
ఎక్కడికి పోయేది..?
తాత ముత్తాతలు నిర్మించిన వందేళ్లకు పైబడిన ఇళ్లు కావడం.. మరో చోట ఉండేందుకు స్థలం లేకపోవడంతో పేదలు అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా యజమానులు వినిపించుకోవడం లేదని సమాచారం. కూల్చివేస్తే పూర్తిగా గూడు కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అందులో ఉంటే ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గోడలు, పైకప్పు అంతా తడిచి ఒకేసారి కూలే అవకాశాలుంటాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూలితే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రమైన జగిత్యాలలో పురాతన ఇళ్లు 81 ఉన్నట్లు గుర్తించారు. కోరుట్లలో 50, మెట్‌పల్లిలో 40కి పైగా ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. స్వతాహాగా కూల్చుకోలేని స్థితి ఉంటే మున్సిపాలిటీకి సమాచారం అందిస్తే కూల్చివేస్తారు. కానీ అలా ఎవరూ ముందుకు రావడం లేదు.
నోటీసులు జారీ చేశాం
జిల్లా కేంద్రంలోని పాత ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేశాం. ప్రమాదం అని తెలిసినా కొందరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ కూల్చివేసుకునే పరిస్థితి లేకుంటే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, టీపీవో

ఇళ్లు శిథిలం.. పొంచి ఉన్న ప్రమాదం

ఇళ్లు శిథిలం.. పొంచి ఉన్న ప్రమాదం

ఇళ్లు శిథిలం.. పొంచి ఉన్న ప్రమాదం