● రూ.4 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేటలో కొడిమ్యాల మండలానికి చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, అతని భార్య వసంత పేరు మీద ఎస్‌వీ షీట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు. దానికి అవసరమైన రా మెటీరియల్ సరఫరా చేస్తామని మహారాష్ట్రకు చెందిన యూనివర్స్ మైన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గతేడాది ఆగస్టు 3న వసంతకు రూ.9,20,400 కొటేషన్ వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో ఆ కంపెనీకి తిరుపతిరెడ్డి అడ్వాన్స్‌గా తన ఖాతా నుంచి రూ.4 లక్షలు పంపించారు. కానీ మెటీరియల్ రాకపోవడంతో పలుమార్లు ఫోన్లు చేశారు. స్పందన లేకపోవడంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని, తాము మోసపోయామని గ్రహించి, మంగళవారం జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ పేర్కొన్నారు.
టెలిగ్రామ్ ప్రకటనతో యువకుడు..
ధర్మపురి: టెలిగ్రామ్‌లో వచ్చిన ప్రకటనను చూసి ఓ యువకుడు మోసపోయిన సంఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన అనిల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ గ్రూప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు అవుతాయని 2023 ఫిబ్రవరి 24న టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ప్రకటన చూశాడు. అందులో ఉన్న నంబర్‌కు తన పేటీఎం నుంచి రూ.11,500 పంపించాడు. తర్వాత ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకొని, మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలు చూసి, మోసపోవద్దన్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆన్‌లైన్ వ్యాపారం పేరిట..
మెట్‌పల్లి(కోరుట్ల): ఆన్‌లైన్ వ్యాపారం పేరిట మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఇండియన్ డెయిరీ పాయింట్ పేరుతో తమతో ఆన్‌లైన్‌లో చేసే వ్యాపారంలో చాలా లాభాలుంటాయని ఒక ప్రకటన ఇచ్చాడు. దీన్ని చూసిన మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఫోన్‌లో అతనిని సంప్రదించాడు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపడంతో దశలవారీగా ఫోన్ పే ద్వారా రూ.1,13,800 పంపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వ్యాపారం గురించి అడిగితే అతని నుంచి స్పందన లేదు. దీంతో తాను మోసపోయాయని గ్రహించిన ఆ వ్యాపారి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.