భూ భారతి సరిచేసేనా..?
● జిల్లాలో భూ సమస్యలు అధికం ● ధరణి స్థానంలో భూ భారతి చట్టం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా బుగ్గారం ఎంపిక ● వందల్లో దరఖాస్తుల స్వీకరణ
జగిత్యాల: ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా బుగ్గారం మండలాన్ని ఎంపిక చేయగా.. ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మండలంలో వందల్లో దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అసైన్డ్, అటవీ భూములు, పార్ట్–బీలో పేర్కొన్న నిషేధిత జాబితాలోని భూ ములు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టం రూ పొందించడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవో లకు మ్యూటేషన్ అధికారం కల్పించడంతో సమస్యలు వేగవంతంగా తీరే అవకాశాలున్నాయంటున్నా రు. జిల్లాలో గత నెల 15 నుంచి 30వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. బుగ్గారంలో రైతుల నుంచి ఈనెల 5 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన సమస్యలను పరి ష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో బృందానికి నాయబ్ తహసీల్దార్, గిర్దవార్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లను కేటాయించారు. మొదట రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తద్వారా గ్రామాల్లో రైతుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి భౌగోళిక హద్దుల్ని నమోదు చేస్తారు. సంబంధిత వివరాలను తహసీల్దార్లకు నివేదించగా దానిపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటారు.
వందల్లో దరఖాస్తులు
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న బుగ్గారం మండలంలో మొత్తం 744 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు 84, పెండింగ్ మ్యూటేషన్లు 22, ఏరియా కరెక్షన్ 128, డీఎస్ పెండింగ్ 10, ల్యాండ్ నేచర్ క్వాలిషిఫికేషన్ 9, పట్టాదారు డిటేయిల్స్ 10, నిషేధిత భూముల గురించి 11, అసైన్డ్ భూమి గురించి 21, సక్సెషన్ 108, ల్యాండ్ ఇక్వేషన్ 2, సాదాబైనామాలు 298, పట్టా ల్యాండ్‌ల గురించి 35, కాస్తు గురించి ఒక టి, డూప్లికేట్ పాస్‌బుక్‌ల గురించి 4, మెర్జింగ్ ఖా తా గురించి ఒక దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారులు 181 దరఖాస్తులను విచారించగా 563 విచారణ చేపడుతున్నారు. బుగ్గారంలో 10 గ్రామాలు ఉండగా.. 122661.21 ఎకరాల భూ మి ఉంది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులు అధికా రులు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
రైతుల్లో ఆశలు
భూభారతి చట్టంతో రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ధరణి పోర్టల్ అమలులో ఉన్నప్పుడు చాలామంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతీది సీసీఎల్ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో కొన్ని పరిష్కారం అ య్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు చేసేదేమీలేక ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి స్థానంలో భూభారతి తీసుకురావడంతో అన్ని సమస్యలకు వెసులుబాటు కల్పించడంతో రైతులకు ఇది ఎంతో మేలు జరుగుతుంది. నేరుగా రైతుల వద్ద నుంచి దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్
ఇక నుంచి కొత్తగా సర్వే పటం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. ముఖ్యంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్‌పూర్ మండలం కొమ్మనపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. మొదట ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, వక్ఫ్, అటవీ తదితర భూములును సర్వే చేయనున్నారు. పహాణిలో ఉన్న వివరాలు, సర్వే ద్వారా వచ్చిన వివరాలను సరిచూసి చర్యలు తీసుకోనున్నారు. ఇలా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తులకు పరిష్కారం
ఇప్పటికే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూభారతి చట్టంపై అవగాహన కల్పించాం. పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం ఎంపిక కాగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. మండలంలో 744 దరఖాస్తులు వచ్చాయి. 181 విచారణ చేపట్టాం. 563 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది.
సత్యప్రసాద్, కలెక్టర్
బుగ్గారం మండల విస్తీర్ణం 19,735.36
రెవెన్యూ గ్రామాలు 10
పంచాయతీలు 10
మొత్తం భూమి 12,261.21 ఎకరాలు
ఎండోమెంట్ : 7.01 ఎకరాలు
అటవీ : 2,474.25 ఎకరాలు
వక్ఫ్ : 1.27 ఎకరాలు
సీలింగ్ అసైన్డ్ : 480.16 ఎకరాలు
అసైన్డ్ ల్యాండ్ : 716.38 ఎకరాలు
ప్రభుత్వ భూమి : 7113.20 ఎకరాలు
భూ భారతి సరిచేసేనా..?


