
జగిత్యాలకు ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు
● జగిత్యాల అంటే తానే అన్నట్లు జీవన్‌రెడ్డి అనుకోవద్దు ● కాంగ్రెస్‌లో అత్యధికసార్లు ఓటమి పాలైంది ఆయనే.. ● జీవన్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫైర్
జగిత్యాల: జగిత్యాలకు ఎవరేం చేశారో ప్రజలందరికీ తెలుసని, తాను చేసిన అభివృద్ధిని చూసే తనను రెండోసారి గెలిపించారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మోతెలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల అంటే తానే అన్నట్లు జీవన్‌రెడ్డి అనుకోవడం సరికాదని హితవు పలికారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు టికెట్ ఇచ్చిందని, అత్యధికసార్లు ఓడిపోయింది కూడా ఆయనేనని గుర్తు చేశారు. గాంధీభవన్‌లో కూర్చుని తనను ఇండిపెండెంట్ అనడం సరికాదన్నారు. గతంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా డబుల్‌బెడ్‌రూంలు మంజూరు చేయించానని గుర్తు చేశారు. జీవన్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, హుందాతనం కాపాడుకుంటే మంచిదని, సీనియర్ నాయకుడిగా సలహాలు ఇవ్వాలని సూచించారు. తనను తరచూ విమర్శిస్తే ఊరుకోనన్నారు. ఆయన అనుచరులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకనుంచి సంహించబోనన్నారు. 2014లో ఇవే చివరి ఎన్నికలు అని చెప్పడంతో తనపై జీవన్‌రెడ్డి గెలిచినా. నైతిక విజయం తనదేనన్నారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన జేఎన్టీయూ, న్యాక్ సెంటర్ గుట్టల్లో పెట్టారని, అక్కడకు సరైన రోడ్లు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఎత్తిపోతల పథకంగానీ.. చెరువులు నింపే ప్రయత్నంగానీ చేయలేదన్నారు. ఆయన వెంట నాయకులు దామోదర్‌రావు, ముజాహిద్, గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, రాజేందర్‌రెడ్డి, నక్కల రవీందర్‌రెడ్డి, గోలి శ్రీనివాస్, రాజిరెడ్డి, ముస్కు నారాయణరెడ్డి, సురేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.