రైతులకు గుర్తింపు కార్డులు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన భూధార్‌కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వానాకాలం సీజన్ ప్రారంభం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లి రైతుల బయోడేటా, భూ వివరాలు సేకరిస్తున్నారు.
రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య
రైతులకు 11 అంకెలతో ఉద్యోగుల మాదిరిగానే రైతులకూ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయం, రైతుల ప్రతి సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో కేంద్రమే దేశవ్యాప్తంగా రైతులు, వారి భూ వివరాలు సేకరించాలని నిర్ణయించింది. రానున్న సీజన్ నుంచే పీఎం కిసాన్ నిధిని విశిష్ట సంఖ్య(భూధార్) ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మండల వ్యవసాయాధికారులు, ఏఈఓలతో సమావేశాలు నిర్వహించి, నమోదు ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.
ప్రతి రైతు వివరాలు సేకరణ
గ్రామస్థాయిలో ఏఈఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వారి బయోడేటా సేకరిస్తారు. రైతు పేరిట ఉన్న భూమి వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరించి.. రైతుల ఆధార్ సంఖ్య, సెల్ నంబర్‌తో ఏఈఓలు తమ వద్ద ఉన్న ట్యాబ్ ద్వారా ప్రత్యేక యాప్‌లలో అనుసంధానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రైతుల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో ఈ రైతు గుర్తింపు సంఖ్య కీలకం కానుంది. ఇతర రాష్ట్రాలలో మీసేవ కేంద్రాల ద్వారా ఈ నమోదు కొనసాగుతుండగా.. ఇక్కడ ఏఈఓలే రైతుల వద్దకు వచ్చి నమోదు ప్రక్రియను చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన సెల్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ రిజిస్ట్రేషన్ సమయంలో రైతుల సెల్ నంబర్‌కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఏఈఓ వద్ద ఉన్న యాప్‌లలో నమోదు చేయగానే సదరు రైతుకు విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య వస్తుంది.
గుర్తింపు సంఖ్యను గుర్తుంచుకోవాలి
విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి ఇచ్చే సబ్సిడీలు, విత్తన పంపిణీ, రుణసాయం వంటి పథకాలన్నింటికీ ఇదే నంబర్ కీలకం కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్, సాయిల్ హెల్త్‌కార్డుల జారీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన, జాతీయ ఆహార భద్రత, పీఎం సమ్మాన్ నిధి, నాబార్డు రుణ సహాయం, జాతీయ ఉపాధి పథకం, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు గుర్తింపు సంఖ్యనే ప్రమాణీకం కానుంది. సెల్ నెంబర్ అధార్‌తో లింక్ అయి ఉంటేనే నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. లేదంటే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది.
రైతులకు అవగాహన
వ్యవసాయ సిబ్బంది చేసే నమోదు ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి తోడు, గ్రామాల్లో మైకుల ద్వారా చాటింపు చేస్తున్నారు. గ్రామానికి ఏ రోజు ఏఈఓలు వస్తారో ముందుగానే ఆ గ్రామ రైతులకు సమాచారం ఇస్తున్నారు. అనర్హుల తొలగింపు, పథకాల అమలు తీరు తెన్నులను తెలుసుకోవడంలో ఈ సంఖ్య కీలకం కానుంది.
ఆధార్ తరహాలో భూధార్ కార్డులు
జిల్లాలో ప్రారంభమైన నమోదు ప్రక్రియ
రైతులకు గుర్తింపు కార్డులు


