సర్పంచుల గెలుపే కాంగ్రెస్ బలానికి నిదర్శనం
ధర్మపురి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల గెలుపే కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఆదివారం స్థానిక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని పటేల్ విగ్రహం నుంచి గాంధీ, నంది, అంబేడ్కర్ కూడళ్ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన 108 మంది సర్పంచులు గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీ బలం ఎంత ఉందో నిరూపించుకున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజల నుంచి విశ్వాసం లభించిందని, అది ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు నిజాలు మాట్లాడితే బీఆర్‌ఎస్ తట్టుకోలేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు మళ్లించడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, సదరు నిధులపై ఆ శాఖ మంత్రిగా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకెంతో దోహదపడుతున్నాయని, ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, మిగిలిన రెండు త్వరలో తప్పక అమలు చేస్తామన్నారు. ధర్మపురి లక్ష్మీనృసింహుని దయ, నియోజకవర్గ ప్రజల అండదండలతో ఎమ్మెల్యే, విప్, మంత్రిగా ఎదిగానని, ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవేర్చుతున్నానని, ఐటీఐ కళాశాల, ధర్మపురిలో బస్‌డిపో తప్పకుండా ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధుల మంజూరుపై సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. అనంతరం సర్పంచులను సన్మానించారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ఏఎంసీ చైర్‌పర్సన్లు, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


