‘పది’కి రెండు నెలలే కీలకం
మార్చి 14 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు ఇప్పటికే టైంటేబుల్ విడుదల చేసిన విద్యాశాఖ మెరుగైన ఫలితాల సాధనకు ‘సంకల్పం’ జనవరి నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు
మల్లాపూర్(కోరుట్ల): పదో తరగతి వార్షిక పరీక్షలకు దాదాపు రెండునెలల సమయం మాత్రమే ఉంది. మార్చి 14 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజులకో పరీక్ష చొప్పున నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుందని విద్యా శాఖ భావిస్తోంది. అయితే విద్యార్థులు ఈ కాస్త సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. రోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక టైం టేబుల్‌ను సిద్ధం చేశారు. ఏ రోజు యే సబ్జెక్టు బోధించాలనేది అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
గతేడాది ఉత్తీర్ణత..
2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 11,849 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా, 11,636 మంది పాసయ్యారు. జిల్లాలో 98.20 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో 12,370 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఉత్తమ మార్కులు సాధించేలా, మిగిలిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది.
ప్రత్యేక శ్రద్ధ
సీ– గ్రేడ్ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడంతో పాటు, సిలబస్ త్వరగా పూర్తి చేసి పునశ్చరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు : 187
కస్తూరిబా విద్యాలయాలు : 14
ప్రభుత్వ పాఠశాలలు : 13
మోడల్ స్కూళ్లు : 13
సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు : 5
తెలంగాణ మైనార్టీ స్కూళ్లు : 5
బీసీ వెల్ఫేర్ స్కూళ్లు : 3
ప్రైవేటు స్కూళ్లు : 103
పదో తరగతి విద్యార్థుల సంఖ్య : 12,370


