
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
● తొమ్మిదేళ్లుగా పంట నష్టాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్ ● ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి
మల్యాల(చొప్పదండి): టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని, వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ కనుసన్నల్లో నడవకపోతే ఆ సంస్థ చైర్మన్‌తో ఎందుకు సమీక్ష చేశారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా ప్రకృతి విపత్తుల కారణంగా పంటలకు నష్టం జరుగుతుంటే రైతులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. కనీసం సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు మరాటి లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధ పడుతుండగా మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి, పరామర్శించారు. అనంతరం మల్యాల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మంచి జరిగితే తమ సమర్థత అని చెప్పుకుంటూ.. వైఫల్యం చెందితే మాత్రం నాకేం సంబంధం అనడం హాస్యాస్పదమని అన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని, ప్రవీణ్, రాజశేఖర్‌ల తప్పిదాలకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీ కారణంగా జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయిందన్నారు. గ్రూప్ 1 పరీక్ష క్వాలిఫై అయిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం అందించాలని కోరారు. అతివష్టితో రోల్ల వాగు, అరగుండాల ప్రాజెక్టులు తెగిపోయి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయిందని తెలిపారు. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసినా అన్నదాతలకు రూపాయి పరిహారం అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, నివేదికలు పంపడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసుకోవడం మినహా రైతులను ఆదుకున్న పాపాన పోవడం లేదని మండిపడ్డారు. మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి, నాయకులు దొంగ ఆనంద రెడ్డి, బోగ బక్కన్న, కంచర్ల లక్ష్మణాచారి, ఎస్సీ సెల్ మండల అద్యక్షుడు శనిగరపు తిరుపతి, మారంపల్లి గంగాధర్, కో–ఆప్షన్ మాజీ సభ్యుడు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.