World Countries Forgotten The Russia-Ukraine War - Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: ఉక్రెయిన్‌ కోసం ఏడ్చేవాళ్లెవరు?

Published Sat, Mar 11 2023 5:20 AM

World Countries forgotten the Russia-Ukraine war - Sakshi

(ఎస్‌.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు.

మిత్ర దేశం బెలారస్‌ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్‌ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు.

ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు.

ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్‌ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్‌ వార్‌ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్‌గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్‌ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప!

పక్కింటి గొడవ స్థాయికి...
యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్‌ను వేధించిన ప్రశ్న. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్‌ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి.

ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్‌ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్‌ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్‌కు డిస్కౌంట్‌ ఇస్తానని ప్రతిపాదించింది.

ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్‌ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్‌కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా.

జర్మనీ, ఫ్రాన్స్, చెక్‌ రిపబ్లిక్, పోలండ్‌ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే!

బావుకున్నదేమీ లేదు
మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్‌ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్‌ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం.

యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్‌పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్‌ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరిస్థితి కూడా పుతిన్‌కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్‌స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్‌స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్‌స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు.

కొసమెరుపు
కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్‌ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్‌ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్‌లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు?

Advertisement
 
Advertisement
 
Advertisement