ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి.. | Who is Alex Padilla Democratic Senator Cuffed Video Viral Full Details | Sakshi
Sakshi News home page

ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి..

Jun 13 2025 2:03 PM | Updated on Jun 13 2025 2:57 PM

Who is Alex Padilla Democratic Senator Cuffed Video Viral Full Details

అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్‌, డెమొక్రటిక్‌ సభ్యుడు అలెక్స్‌ పాడిల్లా(Alex Padilla)తో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ని నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి బేడీలు వేశారు అధికారులు. 

అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం లాస్‌ ఏంజెల్స్‌లో హోంల్యాండ్‌ సెక్యూరిటీ(DHS) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. గత వారం రోజులుగా అక్కడ వలసదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎంత మంది వివరాలు సేకరించారో గణాంకాలను నోయెమ్‌ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘నా పేరు అలెక్స్‌ పాడిలా. సెనేటర్‌ని. సెక్రటరీకి నాదో ప్రశ్న అంటూ మాట్లాడబోయారు. ఇంతలో..

అక్కడున్నన సిబ్బందిని ఆయన్ని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు, వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం.. ఎఫ్‌బీఐ సిబ్బంది ఆయన్ని బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి అదుపులోకి తీసున్నారు. అయితే కాసేపటికే ఆయన్ని అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

డీహెచ్‌ఎస్‌ ఈ చర్యలను సమర్థించుకుంది. పాడిల్లాను దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిగా భావించి అధికారులు అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆయన చర్యను పొలిటికల్‌ డ్రామాగా అభిర్ణించింది. అయితే కాసేపటికే ఆయన్ని విడుదల చేశామని, నోయెమ్‌-పాడిల్లా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారని ప్రకటించింది. మరోవైపు ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌ డాన్‌ బోంగినో కూడా తమ సిబ్బంది చర్యను వెనకేసుకొచ్చారు.  

ఈ ఘటనపై అలెక్స్‌ పాడిల్లా స్పందించారు. ఒక సెనేటర్‌ విషయంలోనే ఇలా జరిగితే.. సాధారణ వర్గాల ప్రజలతో ఇంకెలా వ్యవహరిస్తారో? అని నిలదీశారాయన. వలసవాదులతో ఎలా వ్యవహరిస్తున్నారో.. ఈ దేశ పౌరులతోనూ అలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. మరోవైపు డెమొక్రటిక్‌ పార్టీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయ వ్యాఖ్యానిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, కమలా హారిస్‌, సెనేట్‌లో మైనారిటీ నేత చుక్‌ షూమర్‌ తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఇంకోవైపు రిపబ్లికన్‌ పార్టీలోనూ ఈ ఘటనపై పలువురి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement