
జెఫ్రీ ఎప్‌స్టీన్ పాపాల్లో ట్రంప్‌కు వాటా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్‌స్టీన్ ఓ మానవ మృగం అని, అతనితో చాలా ఏళ్లపాటు ఎలాంటి సంబంధాలు కొనసాగలేదని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో కీలకమైన ఎప్‌స్టీన్ పైల్స్‌లో ట్రంప్ పేరు నిజంగా ఉందా? లేదా? అనే చర్చ అమెరికాలో విస్తృతంగా నడుస్తోంది.
తాజాగా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు పలుమార్లు ప్రస్తావన ఉందని, ఆ విషయాన్ని యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ(Palm Bondi) అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. మే నెలలోనే ఇది జరిగిందని, అయితే ఆ ఫైల్స్‌లో ట్రంప్ ప్రస్తావన ఏయే సందర్భాల్లో వచ్చిందనేది మాత్రం సదరు కథనం వివరించలేదు.
ఎప్‌స్టీన్‌తో దగ్గరి సంబంధాలే ట్రంప్‌కు ఉన్నాయంటూ మొన్నీమధ్య wsj ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 2003లో ఎప్‌స్టీన్ పుట్టినరోజు కానుకగా ట్రంప్ ఓ లేఖ రాశారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ కథనాన్ని తోసిపుచ్చిన ట్రంప్ సదరు మీడియా సంస్థపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈలోపు కనీసం వారం కూడా తిరగకుండానే మరో కథనంతో అదే మీడియా సంస్థ వచ్చింది. అయితే..

ఇది ఊహించిందేనని వైట్‌హౌజ్ అంటోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు.. ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది అమెరికా అధ్యక్ష భవనం. సదరు మీడియా సంస్థ నుంచి ఇలాంటి కథనాలు ఊహించినవేనని, డెమోక్రాట్లు, లిబరల్ మీడియా ట్రంప్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ అధ్యక్షుడు ఒబామాపై విచారణ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ వైట్‌హౌజ్ వర్గాలు అంటున్నాయి.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై అమెరికాలో రాజకీయ దుమారం రేగింది. రష్యాతో చేతులు కలిపి హిల్లరీ క్లింటన్ ప్రచారాన్ని ట్రంప్ దెబ్బ తీయాలని చూశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేవు. అయితే.. తాజాగా ఈ అంశంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాత్రపై పెను దుమారం రేగింది.
ట్రంప్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్ ఆరోపణలు ప్రకారం.. ఒబామా తన ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కలిసి రష్యా జోక్యంపై తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేశారని, తద్వారా ట్రంప్ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూశారన్నది ఆ కథనాల సారాంశం. ఈ ఆరోపణలకు సంబంధించి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌ను గబ్బార్డ్ విడుదల చేశారు కూడా. అయితే.. ఒబామా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో..
అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్‌స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్‌స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం.
చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్‌స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో..
ఎప్‌స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..
ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్‌స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్‌మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..

ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు ఇప్పుడు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్‌స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్‌స్టీన్‌పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్‌స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.