అమెరికాలో సూది చీమల కలకలం.. ఎందుకంత డేంజర్‌? | Venomous Asian Needle Ant Prompts Scare In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో సూది చీమల కలకలం.. ఎందుకంత డేంజర్‌?

May 13 2026 6:36 PM | Updated on May 13 2026 9:27 PM

Venomous Asian Needle Ant Prompts Scare In US

అమెరికాలో ఆసియా నీడిల్ యాంట్ కలకలం రేపుతోంది. అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా 20కి పైగా రాష్ట్రాల్లో ఈ చీమలు వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా, జపాన్, కొరియా దేశాలకు చెందిన నీడిల్ యాంట్‌ దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణ చీమలు మాదిరిగా పెద్ద పెద్ద పుట్టలను నిర్మించుకోలేవు. వరుసగా కూడా ప్రయాణించవు.. దీంతో వీటిని గుర్తించడం కష్టం. ఇవి సాధారణంగా ఇళ్ల దగ్గర ఉండే చెక్కలు, రాళ్లు, ఆకులు, తోట సామాగ్రి కింద దాక్కుంటాయి.

ఆసియా నీడిల్ యాంట్ అంటే..
ఇవి లేత నారింజ-గోధుమ రంగు కాళ్లు, యాంటెన్నాల చివరలు కలిగిన ఒక చిన్న ముదురు గోధుమ, నలుపు రంగు చీమలు. కూలీ చీమలు సాధారణంగా సుమారు 0.2 అంగుళాల పొడవు ఉంటాయి. అవి చిన్నవిగా ఉన్నప్పటికీ.. వాటి కాటు అత్యంత బాధాకరంగా ఉంటుంది.  ఈ చీమల విషం.. అలెర్జీ ఉన్నవారికి చాలా ప్రమాదకరం.. ఈ  చీమలు 1930లలో మొదటిసారిగా అమెరికాలో కనిపించాయని.. ఇప్పుడు ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలలో విస్తృతంగా వ్యాపించాయి.

ఈ చీమలు తేమగా, నీడగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. ఇవి సాధారణంగా కంపోస్ట్, కుళ్ళిపోతున్న కలప, రాళ్ళు, పూల కుండీలు, ఆకుల కుప్పల కింద కనిపిస్తాయి. అవి నిశ్శబ్దంగా కదులుతూ, సాధారణంగా ఒంటరిగా ప్రయాణిస్తాయి కాబట్టి, చాలా మంది అవి కుట్టేంత వరకు వాటిని గమనించరు. ఇతర చీమల జాతులతో పోలిస్తే.. వీటిని నియంత్రించడం కష్టతరం.

ఎందుకు ప్రమాదకరం?
ఆసియా నీడిల్ యాంట్ కుట్టినప్పుడు సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సాధారణంగా కుట్టిన చోట ఎర్రబడటం, వాపు, మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, కొందరిలో కొద్ది నిమిషాల్లోనే గొంతు వాపు, కళ్లు తిరగడం, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి.

తేనెటీగలు, కందిరీగల వల్ల అలర్జీ ఉన్నవారికి దీని వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ చీమల కుట్టు కొందరిలో తీవ్రమైన అలర్జీలు రావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల విపరీతమైన నొప్పి, వాపు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఇది అనాఫిలాక్సిస్ (anaphylaxis) ప్రాణాంతక అలర్జీకి దారితీయవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement