మధుర గాయకుడు జి.ఆనంద్‌కు అంతర్జాలంలో ఘననివాళి

Usa: Celebrities Pay Tribute Internet To Singer G Anandh Texas - Sakshi

టెక్సాస్: ప్రపంచంలోని ఏడు దేశాలనుంచి పలువురు ప్రముఖులు, కరోనాతో పరమపదించిన మధురగాయకులు జి.ఆనంద్ గారికి అంతర్జాలంలో బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు. ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి,"స్వరమాధురి’ సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6500కుపైగా కచేరీలు నిర్వహించారు. ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారు. ఆనంద్ కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయం అందక మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ కళాకారుల జాతి సంపదని వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి వున్నదని అన్నారు. కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానం  ప్రభుత్వాలు పరిశీలించాలని ఆనంద్కు నివాళులర్పిస్తూ అన్నారు.

ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా , శారద ఆకునూరి అమెరికా  సంయుక్త ఆధ్వర్యంలో  అమెరికాలో హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆకునూరి నిర్వహణలో ప్రారంభించారు. న్యూ జెర్సీ నుంచి దాము గేదెల అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాగంటి, ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు.

అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల అమెరికాలో ఆనంద్ గారి గానాన్ని చాలా సార్లు విన్నానని వెంటిలేటర్ దొరకక ఒక గాయకుడు మరణించడం తమనెంతో కలచి వేసిందని అన్నారు. ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్, ఘంటసాల రత్నకుమార్, భువన చంద్ర , మాధవ పెద్ది సురేష్, ఆర్‌ పట్నాయక్, సురేష్  కొండేటి, సారిపల్లి  కొండలరావు , డా.నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా.ఆళ్ల శ్రీనివాస్, శారద సింగిరెడ్డి, దాము గేదెల, రవి కొండబోలు,శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్ , హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం సురేఖ మూర్తి దివాకర్ల, జీ.వీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు ఆనంద్ గారితో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని సంతోషం ట్రినెట్ లైవ్ యూట్యూబ్ చానెల్ , సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లైవ్ ప్రసారం చేశాయి.

( చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా )

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top