తైవాన్‌లో అమెరికా బృందం పర్యటనపై చైనా ఆగ్రహం

US Lawmakers Visit Taiwan China Stages Fresh Military Drills - Sakshi

బీజింగ్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది చైనా. తైవాన్‌పై యుద్ధం చేసినంత పని చేసింది. ఆ ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తోంది అమెరికా. మరోమారు అమెరికాకు చెందిన చట్టసభ్యులు కొందరు తైవాన్‌లో పర్యటించారు. తైపీ నేతలతో సమావేశమైన క్రమంలో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ జలసంధివ్యాప్తంగా తాజాగా మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టినట్లు ప్రకటించింది. యుద్ధ నౌకలు, మిసైల్స్‌, జెట్స్‌ వంటి వాటిని తైవాన్‌ సమీప జలాల్లోకి చైనా పంపించిన తర్వాత ఈ అప్రకటిత పర్యటన చేపట్టారు అమెరికా చట్టసభ్యులు. దీంతో డ్రాగన్‌కు మరింత కోపం తెప్పించినట్లయింది. 

డెమోక్రాటిక్‌ పార్టీ సెనేటర్‌ ఎడ్‌ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు చట్ట సభ్యుల బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరుకుంది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా-తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, వాతావరణ మార్పులు వంటి తదితర అంశాలపై సీనియర్‌ నేతలతో చర్చలు జరిపింది. ఈ బృందం ఆకస్మిక పర్యటనతో బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించినట్లయింది. యుద్ధాన్ని ఎదుర్కునేందుకు పెట్రోలింగ్‌, యుద్ధ సన్నాహక ప్రదర్శనలు చేపట్టినట్లు సోమవారం ప్రకటించింది డ్రాగన్‌. 

‘ తైవాన్‌ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని అణగదొక్కేందుకు నిరంతరం రాజకీయ కుట్రలు చేస్తున్న అమెరికా, తైవాన్‌లకు వ్యతిరేకంగా చేపడుతున్న మిలిటరీ డ్రిల్స్‌ ఇవి. జాతీయ సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు చైనా మిలిటరీ తూర్పు థియేటర్‌ కమాండ్‌ ప్రతినిధి షి యి. మరోవైపు.. పెలోసీ పర్యటనను చాకుగా చూపించి తమ ప్రాంతాన్ని ఆక్రమించుకునే కుట్రలు చేస్తోందని చైనాపై ఆరోపణలు చేసింది తైవాన్‌ ప్రభుత్వం.

ఇదీ చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top