‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!

Uranus 4 biggest moons may have buried oceans of salty water - Sakshi

జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్‌ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు.  

► యురేనస్‌ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్‌ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది.  

► యురేనస్‌పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్‌–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్‌ మోడల్‌ను ఉపయోగించారు.  

► యురేనస్‌ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు.  
► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు.  

► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి.   
► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్‌ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది.  

► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు.  
► యురేనస్‌ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు.  

► యురేనస్‌ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌తో యురేనస్‌ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు.    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top