Russia Ukraine War: రష్యా జనజీవనం ఆగమాగం!

Ukraine Invasion: Rates Up No Jobs Russians Struggle With Sanctions - Sakshi

‘‘ఇది పూర్తిగా కొత్త తరహా సంక్షోభం. బహుశా మాకిది కొత్తేమో!. కంపెనీలు మూతపడి ఉద్యోగాలు ఊడాయి. ఉపాధి లేక ఆదాయం కోల్పోయాం. నిత్యావసరాలు ప్రియంగా మారాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం అయిన వాళ్లను కూడా ఆప్యాయంగా పలకరించుకోలేకపోతున్నాం..’’ అంటూ అందుబాటులో ఉన్న సోషల్‌ మీడియా యాప్స్ ద్వారా తమ ఆవేదనను పంచుకుంటున్నారు రష్యన్‌ ప్రజలు. 

ఉక్రెయిన్‌ సంక్షోభ Ukraine Crisis పరిణామాలను ఖండిస్తూ.. ఆంక్షలతో రష్యాను, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను ఇరకాటంలోకి నెట్టేసినట్లు సంబురపడిపోతున్నాయి పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా. కానీ, ఆ ప్రభావం రష్యన్‌ సాధారణ ప్రజానీకాన్ని ఆగమాగం చేస్తోంది. ఆంక్షల్ని ఎదుర్కొంటూనే.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకెళ్లాలని భావించిన పుతిన్‌కు విరుద్ధ ఫలితాలే దర్శనమిస్తు‍న్నాయి. ‘సెల్ఫ్‌ రష్యా’ ప్రణాళిక బెడిసి కొట్టడంతో పాటు ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థను నానాటికీ దిగజారుస్తోంది. ధరలు విపరీతంగా పెరిగిపోయి.. వ్యాపారాలు పడిపోయి.. అయినవాళ్లతో సంబంధాలకు అన్నిమార్గాలు తెగిపోయి నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు.  

ఉద్యోగాల నుంచి..
► రష్యా దండయాత్రపై ఆగ్రహిస్తూ.. ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున, రికార్డు స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించాయి. విదేశీ కంపెనీలు తమ తమ కార్యాలయాలు, వ్యాపారాలు మూసేసి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉపాధి పోయి లక్షల మంది రోడ్డున పడ్డారు. రష్యాలో మూతపడ్డ కంపెనీలు తెరిపించి ఉపాధి కల్పించాలనుకున్న పుతిన్‌ ప్రభుత్వ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఎదురవుతోంది. ముఖ్యంగా ధనికులు తమకు అనుకూల నిర్ణయాలు పుతిన్‌ నుంచి రాకపోవడంతో సహకారం అందించడం లేదు. 

► నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు కొండెక్కాయి. పాల ధరలు రెట్టింపు కాగా, నిత్యావసరాల ధరలు 50-100 శాతం వరకు పెరిగాయి. వాటిని కొనే స్థోమత సామాన్యులకు లేదు. ఔషధాలకూ కొరత ఏర్పడింది. కొన్ని అయితే దొరకట్లేదు కూడా. స్టాక్‌లు లేకపోవడంతో కొన్నింటిపై పరిమితులు విధిస్తున్నారు.

► రష్యాపై ఆంక్షలతో అయినా దారికి తీసుకురావాలన్నది పాశ్చాత్య దేశాల వ్యూహం. అయినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇది రష్యన్ల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

► ఏటీఎంల నుంచి రోజువారీ ఉపసంహరణలపై రష్యా సర్కారు ఆంక్షలు అమలు చేసింది. విత్‌డ్రా క్యూలు పెరిగిపోతున్నాయి. దళారులు కమీషన్‌ బేస్డ్‌తో కరెన్సీ అందిస్తూ.. అందినంతా జనాల నుంచి లాగేస్తున్నారు.

► పాశ్చాత్య దేశాల ఆంక్షలతో.. రష్యన్‌ వ్యాపారాలు మనుగడ ఇబ్బందికరంగా మారింది. కరోనా టైం కంటే.. ఈ యుద్ధ సమయంలోనే రష్యా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కస్టమర్లు తగ్గిపోతుండడంతో.. ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఆంక్షలతో రష్యాలోని వ్యాపార సంస్థలకు ఆదాయం పడిపోయింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను నిలిపివేశాయి. 

కనెక్షన్‌ కట్‌.. కట్‌..
అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమాల సేవలు కూడా రష్యాలో కొన్ని నిలిచిపోగా, మిగిలినవీ పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రష్యన్‌లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్నారు. గ్లోబల్‌ సోషల్‌ మీడియాపై ఎఫెక్ట్‌ పడడంతో.. రష్యా ఇప్పుడు సొంత మీడియా సంస్థల మీదే ఆధారపడి ఉంది.

  

యుద్ధంతో ఉక్రెయిన్పై తమ అధ్యక్షుడు పుతిన్‌ ఏం సాధిస్తుందో తెలియదుగానీ.. తాము మాత్రం చెప్పుకోలేని కష్టాలు అనుభవిస్తున్నామని వాపోతున్నారు రష్యా ప్రజలు. ఉక్రెయిన్ ప్రజలు ఒకవైపు తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే.. భారీగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేయలేని ఇబ్బందికర పరిస్థితులు రష్యా ప్రజలకు ఎదురవుతున్నాయి. నాలుగో దశ చర్చలతోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలని రష్యాతో పాటు చాలా దేశాలు కోరుకుంటున్నాయి ఇప్పుడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top