
అంకారా: అత్యంత శక్తిమంతమైన నాన్ న్యూక్లియర్ బాంబును తుర్కియే(టర్కీ) అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని తమ దేశ 17వ ఇంటర్నేషనల్ డిపెన్స్ ఇండస్ట్రీ ఫెయిర్‌లో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) ప్రకటించింది. గాజాప్(Gazap) అనే 970 కిలోగ్రాముల ఈ బాంబు.. అత్యంత శక్తిమంతమైన నాన్ న్యూక్లియర్ బాంబుగా పరిగణించబడుతోంది.
ఈ బాంబు పరిమాణమే 970 కిలోలు కాగా, దీని విధ్వంస శక్తి 10 వేల ఫ్రాగ్మెంట్లుగా ఉంది. అంటే ఇది సుమారు కిలోమీటర్ పరిధిలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ బాంబు యొక్క ఫ్రాగ్మెంటేషన్ డెన్సిటీ సాధారణ ఎంకే బాంబు కంటే మూడ రెట్లు అధికం. దీన్ని ఫైటర్ జెట్లలో ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో డ్రోన్ల ద్వారా కూడా ప్రయోగించే అవకాశాలున్నాయి.
హయాలెట్ బాంబు సైతం..
మరో అత్యంత శక్తిమంతమైన బంకర్ బస్టర్‌ను సైతం తయారుచేసింది టర్కీ. హయాలెట్ అనే బంకర్ బస్టర్ బాంబును అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన లక్ష్యాలను లేదా సైనిక బంకర్‌ల వంటి లోతైన భూగర్భంలో పాతిపెట్టిన లక్ష్యాలను చొచ్చుకుపోయేలా రూపొందించబడింది. హయాలెట్‌ను NEB-1, NEB-2 అని కూడా పిలుస్తారు. ఉక్కుగోడలా నిర్మాణాలను సైతం విధ్వంసం చేయడానికి తయారుచేసిన బాంబు ఇది. దీన్ని బంకర్ బస్టర్ బాంబుగా పరిగణిస్తున్నారు.