అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్‌! | Is Trump Stance A Benefit Or A Loss For America | Sakshi
Sakshi News home page

అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్‌!

Jun 5 2025 5:58 PM | Updated on Jun 5 2025 6:54 PM

Is Trump Stance A Benefit Or A Loss For America

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగెయిన్‌’’ ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి.. అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తూండగా.. కొన్ని కంపెనీలు టారిఫ్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటునానయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.

అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్‌ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనా విషయంలోనైతే ఏకంగా 155 శాతం పన్నులకు సిద్ధపడ్డాడు కూడా. పన్నుల విషయంలో భారతీయులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ హెచ్‌1-బీ వీసాలపై నిబంధనలు, గ్రీన్‌కార్డులున్నా హద్దుమీరితే పంపేస్తామన్న హెచ్చరికలు, స్వదేశానికి పంపే డబ్బులపై ఐదు శాతం వరకూ పన్నులు వంటి చర్యలు భారతీయులు, భారతీయ సంతతి అమెరికన్లకు ఇబ్బందికరంగానే మారాయి. అయితే ఈ వైఖరి ట్రంప్‌కు... అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

టూరిజం విషయాన్ని చూద్దాం... ట్రంప్‌ అధ్యక్షుడు కాకమునుపు అంటే 2024లో అమెరికా సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్శించింది. రవాణా, షాపింగ్‌, ఆహార పానీయాల వంటి వాటికి వీరు ఖర్చు పెట్టిన మొత్తం ఎకాఎకి 155 బిలియన్‌ డాలర్లు. హోటళ్లు, దుకాణాలు కళకళలాడుతూండేవి. కానీ.. అధ్యక్షడైన తరువాత ట్రంప్‌ విధిస్తున్న టారిఫ్‌లు, చేస్తున్న ప్రకటనల పుణ్యమా అని ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

మార్చి నాటికి ఈ తగ్గుదల 14 శాతం వరకూ ఉందని అంచనా. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పొరుగున ఉన్న కెనెడా నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఐదో వంతు పడిపోయిందట. ఫలితంగా ఇప్పటివరకూ పర్యాటకులు పెట్టే ఖర్చు 900 కోట్ల డాలర్ల వరకూ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రభావం కాస్తా హోటళ్లు, దుకాణాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.

వెనకడుగు వేస్తున్న కంపెనీలు..
అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్‌ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్‌ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో తాము ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నట్లు డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రకటించగా... వైద్య పరికరాల తయారీ సంస్థ బెల్లూస్కూరా కూడా దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.

బ్రిటన్‌ బొమ్మల కంపెనీ క్యారెక్టర్‌ గ్రూప్‌, మద్యం తయారీ దిగ్గజం డియాగోలు కూడా మెక్సికో, కెనెడాలపై అమెరికా విధించిన పన్నుల నేపథ్యంలో తమ వ్యాపారల ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. ఫలితంగా ఒక్క డియాగో సంస్థకు 200 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.

భారత్‌లో తయారీ చేపడితే భారీ సుంకాలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలను ఐఫోన్‌ సీఈవో టిమ్‌ కుక్‌ పట్టించుకోని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అమెరికాలో వినియోగించే ఐఫోన్‌లో అత్యధికం భారత్‌లోనే తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా అమెరికాలో బాగా పాపులర్‌ అయిన ట్రాక్టర్‌ తయారీ సంస్థ ‘జాన్‌ డీర్‌’ కూడా టారిఫ్‌ల హెచ్చరికలను తోసిరాజంటూ... తయారీ రంగాన్ని కెనెడాకు తరలించే ఆలోచనలో ఉంది. ఏతావాతా... ట్రంప్‌ ధోరణి కాస్తా అమెరికాకు చేటు చేసేట్టే కనిపిస్తోంది!
- గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా

Advertisement
 
Advertisement
Advertisement