అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన అవగాహన ఒప్పందం (MoU)పై బుధవారం సంతకం చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఈ ఒప్పంద పత్రంలో 14 కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది.
వీటిలో కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్ చర్చలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.
ఒప్పందంలోని 14 అంశాలు (అంచనా):
1. తక్షణ కాల్పుల విరమణ
ఇరాన్, అమెరికా అనుబంధ బలగాలు పాల్గొంటున్న అన్ని యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలి. లెబనాన్‌లోని ఘర్షణలు కూడా ఇందులో భాగం.
2. పరస్పర సార్వభౌమాధికారానికి గౌరవం
ఇరు దేశాలు ఒకదాని అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోకూడదని అంగీకరించాయి.
3. 60 రోజుల్లో తుది ఒప్పందం
గరిష్టంగా 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువు పొడిగించవచ్చు.
4. హర్మూజ్ జలసంధిపై ఆంక్షల ఎత్తివేత
అమెరికా 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిపై విధించిన నౌకాదళ నిర్బంధాన్ని పూర్తిగా ఎత్తివేస్తుంది. తుది ఒప్పందం తర్వాత ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కూడా ఉంటుంది.
5. ఉచిత నౌకా రవాణా
ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి రుసుము లేకుండా భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చింది.
6. 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళిక
ఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు అమెరికా సహకరిస్తుంది. అయితే నేరుగా అమెరికా నిధులు ఇవ్వబోదని అధికారులు స్పష్టం చేశారు.
7. ఆంక్షల ఎత్తివేత
తుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్‌పై ఉన్న అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది.
8. అణ్వాయుధాలకు నో
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని మరోసారి హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో తొలగించేందుకు అంగీకరించింది.
9. ప్రస్తుత పరిస్థితుల కొనసాగింపు
తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా సైనిక మోహరింపుల విషయంలో కొత్త మార్పులు ఉండవు.
10. ఇరాన్ చమురు ఎగుమతులకు అనుమతి
ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మినహాయింపులు ఇస్తుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా సేవలపైనా సడలింపులు ఉంటాయి.
11. స్తంభింపజేసిన నిధుల విడుదల
ఒప్పందం విజయవంతంగా అమలైతే ఇరాన్‌కు చెందిన కొన్ని విదేశీ ఆస్తులు, నిధులను విడుదల చేస్తారు.
12. పర్యవేక్షణ వ్యవస్థ
ఒప్పంద అమలు, భవిష్యత్ నిబంధనల పాటింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.
13. తుది ఒప్పందంపై చర్చలు
MoUపై సంతకం అనంతరం శాశ్వత ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.
14. ఐరాస భద్రతా మండలి ముద్ర
తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం తీసుకుని, బైండింగ్ తీర్మానం రూపంలో అమలు చేస్తారు.
ఈ ఒప్పందం అమలైతే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం సాధారణ స్థితికి రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.


