ట్రంప్‌ సంచలన నిర్ణయం.. ఇరాన్‌తో చర్చలకు బ్రేక్‌! | Trump Cancels USA Envoys Pakistan Trip For Peace Talks With Iran | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. ఇరాన్‌తో చర్చలకు బ్రేక్‌!

Apr 25 2026 10:59 PM | Updated on Apr 25 2026 11:15 PM

Trump Cancels USA Envoys Pakistan Trip For Peace Talks With Iran

ప‌శ్చిమాసియాలో ప‌రిస్థితి మ‌ళ్లీ యుద్ధ మేఘాలు  క‌మ్ముకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.  పాకిస్తాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ వేదిక‌గా జ‌ర‌గా ల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చ‌ర్చ‌ల కోసం అమెరికా ప్ర‌తినిధులు స్టీవ్ విట్కాఫ్‌, జారెడ్ కుష్న‌ర్ వెళ్లాల్సి ఉండ‌గా, వారి ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేస్తూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న‌ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్ర‌క‌టించారు. ‘కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృథా కాదు. మా దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వెనుదిరిగిన ఇరాన్ ప్రతినిధులు..
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. 

చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే, ‘చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు’ అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement