కాందహార్‌ కబళింపు దిశగా తాలిబన్లు

Taliban Capture Key Kandahar District, Afghan Forces Flee To Tajikistan - Sakshi

పంజ్వై జిల్లా స్వాధీనం

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధం వేడి మరింత పెరిగింది. అఫ్ఘన్‌ ప్రభుత్వ దళాలతో పోరాడుతున్న తాలిబన్లు కీలకమైన కాందహార్‌ ప్రావిన్సులో ముఖ్యమైన పంజ్వై జిల్లాను గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తాలిబన్లతో పోరాడి ఓడిన అఫ్ఘన్‌ దళాలు, తజ్బకిస్థాన్‌లోకి పారిపోయినట్లు స్థానిక ఏఎఫ్‌పీ ఏజెన్సీ తెలిపింది. తాజా విజయంతో అఫ్ఘన్‌లోని 421 జిల్లాల్లో 100 జిల్లాపై తాలిబన్లకు అదుపు లభించినట్లయింది. ఒక్క కాందహార్‌ ప్రావిన్సులోనే తాలిబన్ల గుప్పిట్లో ఐదు జిల్లాలున్నాయి. కాందహార్‌ నగరంపై పట్టు సాధించేందుకు పంజ్వై జిల్లా కీలకమైనది. అఫ్ఘన్‌ నుంచి యూఎస్‌ దళాలు వైదొలుగుతున్న తరుణంలో తాలిబన్లు దేశంపై పట్టు పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. పంజ్వై జిల్లాను తాలిబన్లు ఆక్రమించడంతో పలువురు స్థానికులు భయంతో అక్కడ నుంచి వలసపోతున్నారు. తాలిబన్లు తాము పాలించే చోట కఠినమైన షరియా చట్టం అమలు చేస్తారన్న భయంతో స్థానికులు పారిపోతున్నట్లు వార్తా వర్గాలు తెలిపాయి. పంజ్వై పతనం అఫ్ఘన్‌ ప్రభుత్వ దళాల అసమర్ధతకు నిదర్శనమని కాందహార్‌ ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు విమర్శించారు. యూఎస్‌ దళాల మద్దతు కోల్పోయిన అఫ్ఘన్‌ దళాలు కావాలనే యుద్ధరంగం నుంచి పారిపోయాయని ఆరోపించారు.

బాగ్రామ్‌ కొంపముంచిందా? 
ఇటీవలే కీలకమైన బాగ్రామ్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలిగాయి. ఈ చర్య తాలిబన్ల చొరబాటుకు మరింత వీలు కలిగిస్తుందని అప్పుడే అంచనాలు వెలువడ్డాయి. వీటిని నిజం చేస్తూ తాజా ఘటనలు జరిగాయి. సంవత్సరాల పాటు యూఎస్‌ తదితర దళాలకు ఈ ఎయిర్‌ఫీల్డ్‌ కీలక బేస్‌గా మారింది. ప్రస్తుతం యూఎస్‌ వైమానిక మద్దతు లేకపోవడంతో అఫ్ఘన్‌ దళాలకు ఓటమి తప్పడంలేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే తమ వైమానిక దళం తాలిబన్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని అఫ్ఘన్‌ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ ప్రకటించారు. పూర్తి శక్తితో తాలిబన్లను అడ్డుకుంటామన్నారు. కాగా ఇప్పటివరకు తమ సరిహద్దులు దాటి దాదాపు 300కుపైగా అఫ్ఘన్‌ సైనికులు పారిపోయి వచ్చారని తజ్బకిస్థాన్‌ ప్రతినిధులు చెప్పారు. మానవతా ధృక్పథంతో వారిని దేశంలోకి ఆహ్వానించామన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top