యూన్‌ సుక్‌ యోల్‌ను  జైలు నుంచి విడుదల చేయండి  | South Korean court orders release of President Yoon Suk Yeol | Sakshi
Sakshi News home page

యూన్‌ సుక్‌ యోల్‌ను  జైలు నుంచి విడుదల చేయండి 

Published Sat, Mar 8 2025 6:33 AM | Last Updated on Sat, Mar 8 2025 6:33 AM

South Korean court orders release of President Yoon Suk Yeol

దక్షిణ కొరియా కోర్టు ఆదేశం  

సియోల్‌:  మార్షల్‌ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు భారీ ఊరట లభించింది. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్‌ సెంట్రల్‌ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్‌ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్‌ లా విధించిన సంగతి తెలిసిందే. 

దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్‌ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్‌ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్‌ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి. 

అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్‌ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్‌ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement