
సాధారణంగా పెళ్లంటే ఎవరు వచ్చినా రాకున్నా వధూవరులైతే పెళ్లిపీటలెక్కుతారు. కానీ తన పెళ్లికి పెళ్లికొడుకే గైర్హాజరైతే..?! అయినా పెళ్లి ప్రక్రియ నిరాటంకంగా జరిగిపోతే! పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో ఇటీవల ఇదే విచిత్రం చోటుచేసుకుంది. చైనా ఫుట్‌బాల్ లీగ్ నుంచి స్వీడన్‌కు చెందిన మాల్మో ఎఫ్‌సీ అనే పుట్‌బాల్ క్లబ్‌లో ఇటీవల చేరిన మొహమ్మద్ బుయా టురే అనే 26 ఏళ్ల ఫుట్‌బాలర్ తన ప్రేయసితో పెళ్లికి సిద్ధమయ్యాడు.
అయితే పెళ్లి రోజునే తొలి మ్యాచ్ ఆడేందుకు వీలుగా ప్రాక్టీస్ సెషన్‌లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ చివరి నిమిషంలో క్లబ్ నిర్వాహకుల నుంచి అతనికి పిలుపు వచ్చింది. ఇక చేసేదేమీ లేకపోవడంతో టురే తన సోదరుడిని వరుడి స్థానంలో కూర్చోబెట్టి స్వీడెన్ వెళ్లిపోయాడు! దీంతో పెళ్లి దుస్తులు ధరించడం దగ్గర్నుంచి వధువుతో కలిసి కేక్ కటింగ్ చేయడం వరకు అతనే పెళ్లి తంతునంతా కానిచ్చాడు.
పెళ్లి ఫొటోలు, వీడియోల్లో దర్జాగా భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చాడు!! ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో టురే స్పందించాడు. పెళ్లికి ముందు రోజే తామిద్దరం పెళ్లి దుస్తుల్లో ఫొటోలు, వీడియోలు దిగామంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అయితే మ్యాచ్‌ల కారణంగా ఇంతవరకు తన ‘భార్య’ను కలుసుకోవడం వీలుకాలేదని.. త్వరలోనే ఆమెను స్వీడన్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే టురే చేసిన ‘పని’ని కొందరు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అసలైన ‘వృత్తి ధర్మం’ అంటూ అతన్ని వెనకేసుకొస్తున్నారు.