Google: వ్యక్తిగత డేటా చట్ట ఉల్లంఘన: భారీ జరిమానా

Russia fines Google 3 million rbls for violating personal data law - Sakshi

మాస్కో: సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా ప్రభుత్వం మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ గూగుల్‌కు 3 మిలియన్ రూబిళ్లు (  సుమారు 31 లక్షల రూపాయల) జరిమానా విధించింది. ఈ విషయంలో గూగుల్‌కు ఇది మొదటి జరిమానా అని మాస్కో టాగన్స్కీ జిల్లా కోర్టు గురువారం తెలిపింది.

ఈ జరిమానాను ధృవీకరించిన గూగుల్‌ దీనిపై ఎలాంటి వ్యాఖ‍్య  చేయలేదు. రష్యాకు టెగ్‌ దిగ్గజాలకు ప్రధానంగా గూగుల్‌కు మధ్య ఇటీవల నెలకొన్న వైరుధ్యాల మధ్య ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాలో వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేయనందుకు ఆల్ఫాబెట్  అనుబంధ సంస్థ  గూగుల్‌కు 6 మిలియన్ రూబిళ్లు వరకు జరిమానా విధించవచ్చని స్టేట్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రోస్కోమ్నాడ్జోర్ గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా నిషేధిత విషయాలను తొలగించడంలో వైఫల్యం, రష్యాలో  విదేశీ టెక్ సంస్థల కార్యాలయాలను తెరవని కారణంగా సోషల్ మీడియా దిగ్గజాలకు రష్యా ప్రభుత్వం జరిమానా విధిస్తోంది. నిషేధిత కంటెంట్‌ను తొలగించనందుకు గతంలో గూగుల్‌కు జరిమానా విధించింది. అలాగే అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ పైనా రష్యా చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.  మరోవైపు  ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా గూగుల్‌కు వ్యతిరేకంగా మూడు కేసులు నమోదు చేసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top