ప్రపంచ దేశాల్లోనూ త్రివర్ణపతాకం రెపరెపలు

Republic Day Celebrations held Worldwide - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రపంచదేశాల్లో పరిమితంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సాధారణ రోజుల్లో కన్నులపండువగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఆయా దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఈ సంబరాల్లో పాల్గొని జాతీయభావం చాటి చెప్పారు. చైనా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్‌ తదితర దేశాల్లో భారత 72వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. చైనా, సింగపూర్, ఆస్ట్రేలియాల్లోని ప్రవాస భారతీయులు పరిమితంగా జరుపుకున్నారు. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో వీక్షించారు.

  • చైనా రాజధాని బీజింగ్‌లో భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భారత రాయబార కార్యాలయంపై భారత రాయబారి విక్రమ్‌ మిశ్రి జాతీయ పతాకం ఎగురవేశారు. బీజింగ్‌లోనూ, పరిసర ప్రాంతాల్లో కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అధికారులు, వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం చేశారు. భారత జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగాన్ని మిశ్రి చదివి వినిపించారు.
  • పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో తాము గణతంత్ర వేడుకలను ఎంతో ఉత్సాహంగా చేసుకున్నట్లు భారత హై కమిషన్ ట్విటర్‌లో తెలిపింది. చార్జ్‌ డి అఫైర్స్‌ సురేశ్‌‌‌ కుమార్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్రపతి సందేశంలోని కొన్ని భాగాలను వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి గీతాలను ఆలపించినట్లు వెల్లడించింది.
  • కోవిడ్‌ ఆంక్షలు పాటిస్తూ బంగ్లాదేశ్‌లో భారతీయులంతా గణతంత్ర దినోత్సవాలను చేసుకున్నట్లు ఢాకా హై కమిషన్‌ ట్వీట్‌ చేసింది. హై కమిషనర్‌ విక్రం దొరైస్వామి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
  • శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హై కమిషన్‌లో హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
  • ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ గీతేష్‌ శర్మ మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌ సందేశాన్ని చదివి వినిపించారు.
  • సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ పి.కుమారన్‌ గణత్రంత ఉత్సవాలకు సారథ్యం వహించారు. రాష్ట్రపతి ఉపన్యాసాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు.
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top