Vaccine: టీకాల కోసం శాస్త్రవేత్తలు కొత్త చిట్కాను కనిపెట్టారు

Recipe For Even More Powerful Covid-19 Vaccines Found - Sakshi

వ్యాక్సిన్‌ను మరింత శక్తివంతం చేసే చిట్కా కనుగొన్న సైంటిస్టులు 

బోస్టన్‌: కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాల కోసం శాస్త్రవేత్తలు కొత్త చిట్కాను కనిపెట్టారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మానవ కణాలు ప్రతిస్పందించే తీరు ఆధారంగా దీన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన అనంతర మానవ శరీరం టీసెల్స్‌ సాయం పొందడం కోసం చూపే స్పందనలను గుర్తించినట్లు బోస్టన్, హార్వర్‌ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్‌ టీకాలు శరీరంలో బీ సెల్స్‌ను యాక్టివేట్‌ చేసేలా రూపొందించడం జరిగింది.

శరీరంలో ఉద్భవించే ఈ బీ సెల్స్‌ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇంతవరకు టీ సెల్స్‌ను యాక్టివేట్‌ చేసే దిశగా ఎలాంటి టీకాలు రాలేదు. తాజా పరిశోధనలో టీ సెల్స్‌ యాక్టివేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీసెల్స్‌ కూడా యాక్టివేట్‌ అయితే శరీరంలో రోగనిరోధకత మరింతగా పెరుగుతుందని, పలు వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని వివరించారు. బీసెల్స్‌ లాగా కాకుండా టీ సెల్స్‌కు మెమరీ పవర్‌ ఉంటుంది. అంటే ఒకసారిఎదుర్కొన్న ఇన్‌ఫెక్షన్‌ను అవి గుర్తుంచుకొని తర్వాత ఎప్పుడు ఈ తరహా ఇన్‌ఫెక్షన్‌ ఎదురైనా వెంటనే ప్రతిస్పందిస్తాయి. ఈ  వివరాలను జర్నల్‌ సెల్‌లో ప్రచురించారు.  

సంపూర్ణ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌  
ప్రస్తుత టీకాల్లో అన్నిరకాల ఇమ్యూనిటీ రెస్పాన్స్‌లను యాక్టివేట్‌ చేసే వైరల్‌ మెటీరియల్‌ లేదని గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. సంపూర్ణ రోగనిరోధకతను ప్రేరేపించేందుకు అవసరమైన మిస్సింగ్‌ వైరల్‌ ప్రోటీన్‌ మెటీరియల్‌ కోసం కరోనా సోకిన మానవ కణాలను వీరు పరిశోధించారు. ఈ మిస్సింగ్‌ ప్రోటీన్ల ఆధారంగా కంపెనీలు టీకాలను రీడిజైన్‌ చేయాలని పరిశోధకుల్లో ఒకరైన మోషాన్‌ సయీద్‌ సూచించారు.  తాజా పరిశోధన ప్రకారం మానవ ఇమ్యూనిటీ వ్యవస్థను యాక్టివేట్‌ చేసే వైరల్‌ ప్రోటీన్స్‌లో 25 శాతం ఈ నూతన ప్రోటీన్‌ నుంచి వస్తోందని గుర్తించారు. ఇది చాలా కీలకమైన ఆవిష్కరణని ప్రొఫెసర్‌ గబ్బే చెప్పారు. ఈ ఆవిష్కరణతో వైరస్‌లను పూర్తిగా అనుకరించే టీకాలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top