శ్రీలంక నిరసనలకు తెర.. 4 నెలల తర్వాత టెంట్లు తొలగింపు!

Protest Camp Near Lanka President Office Cleared After 4 Months - Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను వేలాది మంది ముట్టడించటంతో అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత‍్వం కొలువుదీరింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడి భవనం సమీపంలోని ప్రధాన నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు నిరసనకారులు. దేశ రాజధాని, గాలేఫోస్‌ సీఫ్రంట్‌లోని టెంట్లను తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్థులు, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని బృందం తెలిపింది. స్థానిక హోటళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, టెంట్లను తొలగించాలని పోలీసులు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన 4 పిటిషన్లను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు నిరసనకారుల ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే నిరసనకారుల టెంట్లను తొలగిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. 

ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు, ఇంధనం, ఆహార కొరత ఏర్పడటంతో ఏప్రిల్‌ 9న నిరసనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఉద్యమం ఉధృతంగా మారింది. జులై 9న అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలోకి వందల మంది నిరసనకారులు చొరబడ్డారు. దాంతో గొటబయ దేశం విడిచి పారిపోయారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్ష భవనం, నివాసాలను నిరసనకారులు ఖాళీ చేశారు. పోలీసుల దాడుల్లో సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అంతర్జాతీయంగా వచ్చిన వ్యతిరేకతో వాణిజ్యం సంఘం అగ్రనేత జోసెఫ్‌ స్టాలిన్‌ను గత సోమవారం విడుదల చేశారు. మరోవైపు.. గొటబయ రాజపక్స వారసుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రణీల్‌ విక్రమ సింఘే. దేశంలో మళ్లీ నిరసనలు జరగకుండా అత్యవసర పరిస్థితి విధించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: థాయ్‌లాండ్‌ చెక్కేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top