తీవ్ర దుమారం రేపుతున్న ట్రంప్‌ ట్వీట్‌

Postpone Election Donald Trump Tweet On Election - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ట్వీట్‌ చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతమున్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడి, ప్రజలంతా క్షేమంగా బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మంచిదన్నారు. కాగా నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది. (వైస్‌ ప్రెసిండెంట్‌ అభ్యర్ధిగా కమలా హారిస్‌!)

కాగా ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరు చేస్తుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయా? లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. మొదటితో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దేశంలో విసృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్‌ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న కరోనా కాలంలో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఈ మెయిల్‌ ఓటింగ్‌కు ట్రంప్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఎన్నికలు కొంత కాలంపాటు వాయిదా వేసే అవకాశం ఉందటూ రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. (వీసాల నిలిపివేత : ట్రంప్‌నకు భారీ షాక్‌)

రాజ్యాంగంలో ఏముంది?
అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్పీకరించిన చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారం నాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్‌ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరమైన అంశం. నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే ట్రంప్‌ ట్వీట్‌ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది. ప్రపంచ యుద్ధాలు లాంటి గడ్డు పరిస్థితులను నేరుగా ఎదుర్కొన్న అమెరికాలో ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. కానీ అంతకుమించిన విపత్తును కరోనా వైరస్‌ వల్ల ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా రిపబ్లిక్‌ పార్టీ తరఫున ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగుతుండగా.. డెమొక‍్రటిక్‌ పార్టీ నుంచి జో బిడెన్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top