అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. చర్చల కొనసాగింపుకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు.
ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి కూడా అయిన దర్ టెలిఫోన్‌లో అరాఘ్చీతో మాట్లాడినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించేందుకు అన్ని పెండింగ్ సమస్యలను త్వరితంగా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం చర్చలు ఎంతో అవసరమని దర్ పేర్కొన్నట్లు పాక్ తెలిపింది.
అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మంగళవారం ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకు ప్రకటించారు.
ఇక ఇరాన్ రెండో విడత చర్చలకు నిరాకరించిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్‌తో మలి విడత చర్చల కోసం పాక్‌కు వెళ్లలేదన్న సమాచారం చర్చనీయాంశమైంది.


