తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం 

Pakistan Taken Serious Decisions On Economic Crisis - Sakshi

దాయాది దేశంలో పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఇంధన పొదుపు(విద్యుత్‌, చమురు)పై ఫోకస్‌ పెంచింది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. మార్కెట్లు, మాల్స్, కళ్యాణ మండపాల్లో ఇంధన పొదుపుకు చర్యలు తీసుకుంది. 

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ సర్కార్‌ సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి ప్రభుత్వం కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. ఇంధన ఆదాతోపాటు చమురు దిగుమతులను తగ్గించేందుకుగానూ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో భాగంగా జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా మార్కెట్లు, వివాహ వేదికలను సాధారణ సమయానికి ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపింది.

కేబినెట్‌ సమావేశం అనంతరం పాకిస్తాన్‌ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్‌ హాల్స్‌ను మూసివేయాలి. దీంతో 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయి. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని నిలిపివేస్తాం. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తాం. దీంతో.. మరో 37 బిలియన్లు ఆదా అవుతాయి. ఏడాదిలోపు కేవలం కొనికల్‌ గీజర్‌ల వాడకాన్ని తప్పనిసరి చేస్తాం. ఫలితంగా.. తక్కువ గ్యాస్‌ వినియోగంతో 92 బిలియన్లు మిగులుతాయి. వీధి దీపాల్లో మార్పులతో మరో 4 బిలియన్లు ఆదా అవుతాయి. నేడు జరిగిన కేబినెట్‌ భేటీ కూడా పగటి పూట వెలుతురులోనే జరిగింది. భేటీలో లైట్లను ఉపయోగించలేదు అని చెప్పుకొచ్చారు. 

ఇదే క్రమంలో.. 2023 ఏడాది చివరి నాటికి దేశంలో  ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కూడా ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, చమురు నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం, ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top