టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి చర్చలతో ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు మొదటి నుంచి సూచిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌లో మొదటి దశ చర్చలు జరిగి, అవి విఫలమయ్యాయి. సోమవారం రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ నేడు చర్చలు జరగలేదు. ఇరాన్ చర్చలకు వెళ్లకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు బుధవారం (ఏప్రిల్ 22)తో అమెరికా-ఇరాన్ మధ్య కాల‍్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితులు అత్యంత భయానకంగా ఉంటాయి.
సోమవారం చర్చలు జరుగుతాయని భావించడంతో ఇస్లామాబాద్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉంది. ముందుగా ట్రంప్.. వాన్స్ హాజరు కావడంలేదని చెప్పినప్పటికీ చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
వాన్స్ ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి చర్చల రౌండ్‌కూ నాయకత్వం వహించిన విషయంతెలిసిందే. ఈ సారి అమెరికా ప్రతినిధి బృందంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు.
అమెరికాతో తదుపరి దశ చర్చల రౌండ్‌పై ఎలాంటి ప్లాన్‌లూ లేవని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండో దశ చర్చలు జరగాలని అంతర్జాతీయ మధ్యవర్తులు చెప్పినప్పటికీ ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
చర్చలు ఎందుకు జరగలేదు?
ప్రస్తుత కాల్పుల విరమణ ఏప్రిల్ 22న ముగియనున్న నేపథ్యంలో చర్చలు జరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం చర్చలకు అనుకూలం కాదని ఇరాన్ అధికారులు అంటున్నారు. దేశ ప్రయోజనాలు, భద్రత కోసం ఏం చేయడానికైని సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెబుతోంది. అయితే, అమెరికన్లు తమ బెదిరింపు విధానంతో అధిక డిమాండ్లను సాధించుకునేందుకు చర్చల వేదికలను వాడుకుంటే కుదరదని హెచ్చరిచింది.
అమెరికా నావికాదళ నిర్బంధం, అణు డిమాండ్లపై ఇరాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లపై అమెరికా వైపు నుంచి సానుకూల సంకేతం వస్తేనే ఇరాన్ దౌత్య బృందం ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. హార్మూజ్ జలసంధి, లెబనాన్, అణు కార్యక్రమం, సీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయడం వంటి వాటిపై ఇరాన్ డిమాండ్లను పెడుతోంది. తాజాగా ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరాన్ రగిలిపోతోంది. దీనిపై ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ తెలిపింది. చర్చల ముందు ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస‍్తున్నాయి.
నెక్ట్స్ ఏం జరుగుతుంది?
చర్చలు పునఃప్రారంభం కాకపోతే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఈ కింది పది ప్రమాదాలు పొంచి ఉంటాయి.
కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది
పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది
హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం వల్ల చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది
గ్యాస్, ఇంధన కొరత పలు దేశాల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది
అంతర్జాతీయ చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది
స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి రావచ్చు
పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది
ఇతర దేశాలు ఈ ఘర్షణలో చేరే ప్రమాదం ఉంది
దౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి దీర్ఘకాలిక అస్థిరత నెలకొనే అవకాశం ఉంది


