భారత సరిహద్దులపై చైనా కొత్త విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

New China Foreign Minister Qin Gang Comments On Ties With India - Sakshi

వాషింగ్టన్‌: చైనా విదేశాంగ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన క్విన్‌ గ్యాంగ్‌ భారత్‌తో సంబంధాలు, సరిహద్దు సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని బీజింగ్‌ చూస్తోందని తెలిపారు. వాంగ్‌ యీ స్థానంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే యూఎస్‌ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.

‘ప్రపంచం పట్ల చైనా ధోరణి’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ మ్యాగజైన్‌లో భారత్‌-చైనా సరిహద్దు అంశాలను ప్రస్తావించారు క్విన్‌ గ్యాంగ్‌. సరిహద్దుల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. అమెరికాపై మండిపడ్డారు క్విన్‌. తైవాన్‌ విషయంలో అమెరికా, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులకు జపాన్‌లు కారణమని పేర్కొన్నారు. చైనా అభివృద్ధి అంటే శాంతిని పరిరక్షించేందుకు బలమైన దళాన్ని సిద్ధం చేయటం తప్పా.. వారు చెబుతున్నట్లు భౌగోళిక స్థితిని మార్చే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలకు కారణం చైనా కాదని, తైవాన్‌ వేర్పాటువాదులు, విదేశీ శక్తులు అందుకు కారణమని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు అమెరికాలో చైనా రాయబారిగా పని చేశారు 56 ఏళ్ల క్విన్‌ గ్యాంగ్‌. విదేశాంగ మంత్రిగా పదోన్నతి కల్పించిన క్రమంలో వాషింగ్టన్‌ నుంచి చైనాకు పయణమయ్యారు. 13వ జాతీయ ప్రజా కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించింది.

క్విన్‌ గ్యాంగ్‌కి అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్‌
చైనా నూతన విదేశాంగ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌. వాషింగ్టన్‌-బీజింగ్‌ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సమచారా మార్పిడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: పాక్, భారత్‌ మధ్య అణు సమాచార మార్పిడి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top