అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏంచేస్తారో పూర్తిగా ఎవరూ ఊహించలేరని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ చెప్పారు. భారత్‌లో అత్యంత అనుభవజ్ఞులైన దౌత్యవేత్తల్లో తల్మీజ్ అహ్మద్ ఒకరు. పశ్చిమ ఆసియా, గల్ఫ్, ప్రపంచ వ్యూహాత్మక వ్యవహారాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఇరాన్‌పై తక్కువ సమయంలో విజయం సాధిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుదోవ పట్టించారని అన్నారు. చివరకు యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం సాగిందని ఆయన చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు.
ట్రంప్ ఇలా భావిస్తున్నారు
ట్రంప్ ఇప్పుడు ఇలా అనుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు తల్మీజ్ అహ్మద్ చెప్పారు. ‘‘నెతన్యాహు తనను అందరి ముందు వెర్రివాడిని చేశానని ట్రంప్ అనుకుంటున్నారు. ఎల్ డొరాడో (అపార సంపద, అసాధ్యమైన గొప్ప విజయానికి ప్రతీకగా వాడే పదం) చూపిస్తానని హామీ ఇచ్చాడని, చివరికి తనకు ఏమీ ఇవ్వలేదని ట్రంప్ అనుకుంటుండొచ్చు. తన దేశంలోనే అవమానం ఎదుర్కొంటున్నానన్న భావన ట్రంప్‌లో ఉంది. అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తాను అగస్టస్ సీజర్‌లా ఉండాల్సిందని ట్రంప్ భావిస్తుండొచ్చు’’ అని అనుకుంటున్నారని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.
ట్రంప్ ఆశలు నెరవేరకుండా అడ్డొస్తే ఎవరిపై అయినా ఇలాంటి కోపమే బయటపడుతుందని తల్మీజ్ అహ్మద్ అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌పై ఆయన చూపిన ఆగ్రహం గుర్తుందా? యుద్ధం ముగియడానికి ట్రంపే కారణమని చెప్పలేదని, తనకు గుర్తింపు ఇవ్వలేదని ఆయన మనపై నింద వేస్తున్నారు. మనం తనతో కలవకపోవడం వల్లే తనకు నోబెల్ బహుమతి రాలేదని ఆయన నమ్ముతున్నారు’’ అని తల్మీజ్ అహ్మద్ తెలిపారు.
‘‘డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఎవరి ఊహకూ అందని విధంగా వ్యవహరించే వ్యక్తి. ఆయన ఎవరైనా ఇచ్చే సలహాలు తీసుకుంటారా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు.ఇప్పటి వరకూ ఆయన వైఖరి ఏమిటంటే... ఆయన బెంజమిన్ నెతన్యాహు ప్రభావానికి సులభంగా లోనయ్యారు. నెతన్యాహు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అధ్యక్షుడి బలహీనతలను ఆయన చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. మొదటి పదవీకాలంలోనూ ఆయన ఇదే చేశారు.
అధ్యక్షుడి మనస్తత్వం ఆయనకు పూర్తిగా తెలుసు. ఎప్పుడు ఏ మాట చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. తన గొప్పతనంపై అతిగా నమ్మకం పెట్టుకుని, అసాధారణ విజయాలే సాధిస్తానని భావించే మానసిక ధోరణి ట్రంప్‌ది. ఇరాన్‌లో మీకు కొత్త పాలనను తీసుకొస్తాను. గత 40 ఏళ్లలో వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులు సాధించలేనిది మీరు సాధిస్తారు అని అమెరికా అధ్యక్షుడికి నెతన్యూహు చెప్పారు.
నెతన్యాహూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ సేకరించిన అత్యంత సవివర పత్రాలను డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచారు. ఆ పత్రాల ప్రకారం, ఇరాన్ రహస్యంగా మరోసారి అణు ఆయుధాన్ని అభివృద్ధి చేసిందని, అది సిద్ధం కావడానికి ఇంకొన్ని వారాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇది వినడానికి నవ్వొచ్చే విషయం. ఎందుకంటే గత 20 ఏళ్లలో కనీసం 10 లేదా 15 సార్లు నెతన్యాహు ఇదే మాట చెప్పారు.
ప్రతి సారి వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆ వాదనను తిరస్కరించారు. అమెరికా నిఘా సంస్థల అంచనాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధ కార్యక్రమం లేదని అవి స్పష్టంగా చెప్పాయి. అయినా ఫిబ్రవరి 11న జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్‌ను నెతన్యాహు నేరుగా ఒప్పించగలిగారు. అలా ఆయనను తన వైపు తిప్పుకున్నారు’’ అని తెలిపారు.
అతనే ప్రమాదకరమైన శత్రువు
మొదటి రోజే వారి అత్యున్నత నాయకుల్లో 40 మందిని (సుప్రీం లీడర్ సహా) హతమారుస్తానని, దాంతో పాలన మార్పునకు మార్గం సుగమమవుతుందని ట్రంప్‌నకు నెతన్యాహు తెలిపారని తల్మీజ్ అహ్మద్ అన్నారు. ‘‘4 లేదా 5 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందని, దీర్ఘకాల ఘర్షణ ఉండదని అన్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఉన్న అత్యంత గొప్ప అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారని అన్నారు. జిమ్మీ కార్టర్ నుంచి ఇప్పటి వరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ సాధించలేనిది సాధిస్తారని తెలిపారు.
ప్రపంచ వేదికపై అమెరికా ఇచ్చిన అత్యంత గొప్ప సైనిక నాయకుడిగా, అత్యంత గొప్ప రాజనీతిజ్ఞుడిగా ట్రంప్ గర్వంగా నిలుస్తారని నెతన్యాహు అన్నారు. మీ ఎదుట మెగాలోమానియా (తన గొప్పతనంపై అతిగా నమ్మకం పెట్టుకుని అసాధారణ విజయాలే సాధిస్తానని భావించే మానసిక ధోరణి) ఉన్న వ్యక్తి ఉంటే, అతనే మీకు ఉండే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఎందుకంటే అతనిలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఆ అర్థంలో చూస్తే ఆయన హేతుబద్ధంగా ఆలోచించే సాధారణ మనిషి కాదు. ట్రంప్ మెగాలోమానియా ఉన్న వ్యక్తి. ఇప్పుడు జరిగినది కూడా అదే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిలో రగులుతున్న కోపానికి కారణం ఇదే’’ అని తల్మీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.


