Russia Ukraine War: ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం.. నాటోలో కీలక పరిణామం

NATO Extends Jens Stoltenberg Term As Secretary General By A Year - Sakshi

నాటో(నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) సెక్రటరీ జనరల్‌గా జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్ పదవీకాలాన్ని ఒక సంవత్సరంపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ను 2023 సెప్టెంబర్‌ 30 వరకు పదవీలో కొనసాగించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో సదస్సు అనంతరం సభ్య దేశాల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోలెన్‌బర్గ్‌.. నాటో సెక్రటరీ జనరల్‌గా 2014 అక్టోబర్‌లో నియమితులయ్యారు. 

కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు నాటో సభ్యత్వ దేశాల అధికారులు బ్రెజిల్‌ రాజధాని బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కీలక చర్చ జరిగింది. ఈ భేటీలోనే స్టోలెన్‌బర్గ్‌ పదవీ కాలాన్ని పెంచేందుకు నాటో దేశాల నేతలు అంగీకారం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలాన్ని పెంచడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టోలెన్‌బర్గ్‌ హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: Russia-Ukraine war: కలకలానికి నెల!

‘నాటో సెక్రటరీ జనరల్‌గా నా పదవీకాలాన్ని 30 సెప్టెంబర్ 2023 వరకు పొడిగించాలని నాటో దేశాధినేతలు నిర్ణయం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుతం మేము అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, మా కూటమిని బలంగా, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మేమంతా కలిసి ఐక్యంగా పోరాడతాం’ అని స్టోల్టెన్‌బర్గ్ ట్వీట్ చేశారు.

కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బెల్జియం, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది. సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న దాడిని నాటో పలుమార్లు ఖండించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top