క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్‌ చేంజర్‌

The Multi-Cancer Early Detection New Test Detected Without Symptom - Sakshi

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: క్యాన్సర్‌ ప్రాణాంతక రోగమని, మొదట్లోనే గుర్తించకుంటే బతకడం కష్టమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు వ్యాధిని గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కనిపెట్టేందుకు పరీక్షలు కూడా లేవు. అయితే ఒకే ఒక రక్తపరీక్షతో చాలారకాల క్యాన్సర్లను ఇట్టే కనిపెట్టేయొచ్చంటే? హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. సరిగ్గా అలాంటి మల్టీ క్యాన్సర్‌ అర్లీ డిటెక్షన్‌ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం. ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా! 

ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్‌ నిర్ధారణలో గేమ్‌ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్‌ అనే హెల్త్‌ కేర్‌ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ మెడికల్‌ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్‌ తమ పరిశోధన వివరాలను సమర్పించింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్‌ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్‌ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్‌ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు. 

ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్‌ స్టేజ్‌–2, బోన్‌ క్యాన్సర్‌ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top