యుద్ధంలోకి లాగుతారా..? చిచ్చు రాజేసిన మక్కా కూటమి! | Mecca Pact Sparks Political Storm In Turkey As Erdogan Faces Fierce Opposition Backlash, Check Out More Details | Sakshi
Sakshi News home page

యుద్ధంలోకి లాగుతారా..? చిచ్చు రాజేసిన మక్కా కూటమి!

Oct 8 2026 11:32 AM | Updated on Oct 8 2026 11:44 AM

Mecca Pact Ignites Row in Turkey Erdogan Faces Opposition Backlash

హౌతీల దాడులతో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. సౌదీ, టర్కీ, పాకిస్తాన్‌ కలిసి ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమి ఇప్పుడు రాజకీయ చిచ్చు రాజేసింది. సౌదీ రక్షణకు అవసరమైన సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు కూటమి నిర్ణయించడంపై టర్కీ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం టర్కీని యెమెన్‌ యుద్ధంలోకి లాగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్‌ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా స్పందించాలి. రక్షణ సహకారం, పరస్పర నిరోధక సామర్థ్యాన్ని పెంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. అంటే.. సరిగ్గా నాటో తరహా అన్నమాట. మక్కాలో జరిగిన ఈ భేటీలో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌తో కలిసి టర్కీ అధ్యక్షుడు రెజెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు.

అయితే యెమెన్‌లోని హౌతీలు సౌదీపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 5న రియాద్‌లో మక్కా కూటమి వ్యూహాత్మక-రాజకీయ, రక్షణ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉమ్మడి రక్షణ చర్యలను తక్షణమే అమలు చేయాలని, సౌదీలో అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను వేగంగా మోహరించాలని నిర్ణయించారు. అయితే ఆయా దేశాల జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ చర్యలు ఉంటాయని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. 

‘ఇది రాజ్యాంగ నేరం!’
మక్కా కూటమి నిర్ణయంపై టర్కీ ప్రధాన ప్రతిపక్ష నేత ఒజ్‌గుర్‌ ఓజెల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఆమోదం లేకుండా సైనిక మోహరింపుపై నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. యుద్ధంలో ఉన్న దేశంతో రక్షణ ఒప్పందం చేసుకోవడం ద్వారా టర్కీ కూడా ఆ యుద్ధంలో భాగస్వామిగా మారే ప్రమాదం ఉందన్నారు. ‘వందేళ్ల తర్వాత టర్కీ సైనికులను యెమెన్‌ ఎడారులకు పంపే సాహసాన్ని మేం అంగీకరించం’ అని ఓజెల్‌ స్పష్టం చేశారు. 

ఇయీ పార్టీ ఎంపీ తుర్హాన్‌ కొమెజ్‌ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. టర్కీ రాజ్యాంగంలోని 90, 92 అధికరణాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్‌, సౌదీ ప్రయోజనాల కోసం టర్కీ సైనికులను యెమెన్‌కు పంపకూడదని పేర్కొన్నారు. మరో ప్రతిపక్ష నేత నామిక్‌ టాన్‌ అయితే మక్కా ఒప్పందం అసలు చట్టబద్ధంగా ఏ రూపంలో ఉందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ ఆమోదం లేకుండా దాన్ని అమలు చేయలేమన్నారు. సైనిక బలగాలు లేదా రక్షణ సామర్థ్యాలను యెమెన్‌కు పంపుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని హెచ్చరించారు. 

పార్లమెంట్‌ ఆమోదం ఉందా?
ఇదే ఇప్పుడు టర్కీలో ప్రధాన ప్రశ్న. మక్కా రక్షణ ఒప్పందాన్ని టర్కీ పార్లమెంట్‌ ఇంకా ఆమోదించలేదు. విదేశీ గడ్డపై టర్కీ సైన్యాన్ని మోహరించేందుకు కూడా సాధారణంగా పార్లమెంట్‌ అనుమతి అవసరం. టర్కీ రాజ్యాంగంలోని 90, 92 అధికరణాలను ఉటంకిస్తూ విపక్షాలు ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నాయి. అయితే మక్కా కూటమి ఒప్పందాన్ని పార్లమెంట్‌ ఆమోదం కోసం త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారపక్ష వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత టర్కీ సైనిక సహకారం మరింత విస్తరించే అవకాశముంది.

ఇప్పటికే సౌదీలో టర్కీ సహకారం
అయితే టర్కీ పూర్తిగా పక్కన ఉన్న దేశం కాదు. సౌదీ రక్షణకు టర్కీ ఇప్పటికే సాంకేతిక, రక్షణ సహకారం అందిస్తోంది. వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్‌ ఆపరేటర్లు, నిఘా–సమాచార సేకరణ, వ్యూహాత్మక ప్రణాళిక, లాజిస్టిక్స్‌ వంటి అంశాల్లో సహాయం అందిస్తున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ సహకారం ప్రధానంగా ద్వైపాక్షిక స్థాయిలోనే కొనసాగుతోందని, మక్కా ఒప్పందాన్ని టర్కీ పార్లమెంట్‌ ఆమోదించిన తర్వాత దాని పరిధి పెరిగే అవకాశం ఉందని సమాచారం.

యెమెన్‌లోకి నేరుగా దిగుతారా?
ఇక్కడే మరో కీలక అంశం. టర్కీ ప్రస్తుతం పెద్ద సంఖ్యలో సైనికులను యెమెన్‌లోకి పంపే ఆలోచన లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సౌదీ రక్షణను బలోపేతం చేయడమే ప్రస్తుత లక్ష్యమని.. ముఖ్యంగా వైమానిక రక్షణ, డ్రోన్లను అడ్డుకోవడం, నిఘా సామర్థ్యాల పెంపుపైనే దృష్టి ఉంటుందని పేర్కొంటున్నాయి. అయితే పార్లమెంట్‌ ఆమోదం తర్వాత సౌదీకి అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలు, సాంకేతిక సిబ్బంది, పైలట్లు, విమానాలను పంపే అవకాశంపై కూడా నివేదికలు వెలువడ్డాయి. హౌతీల డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులను ఎదుర్కోవడమే వీటి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. 

హౌతీలతో పోరు.. టర్కీకి కొత్త చిక్కు
సౌదీ మద్దతున్న యెమెన్‌ బలగాలు హౌతీలపై దాడులను ముమ్మరం చేసిన సమయంలోనే మక్కా కూటమి యాక్టివేషన్‌ జరిగింది. ముఖ్యంగా ఎర్ర సముద్రానికి కీలకమైన బాబ్‌ అల్‌-మండేబ్‌ జలసంధి చుట్టూ పోరు తీవ్రతరమవుతోంది. హౌతీల దాడుల నుంచి సౌదీని రక్షించేందుకు కొత్త కూటమి తన సైనిక సామర్థ్యాలను సిద్ధం చేస్తోంది. అయితే సౌదీ రక్షణలో భాగంగా టర్కీ మరింత ముందుకెళ్తే.. అది యెమెన్‌ యుద్ధంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామి అయ్యే ప్రమాదం ఉందన్నది టర్కీ విపక్షాల ప్రధాన ఆందోళన. అందుకే మక్కా కూటమి ఇప్పుడు టర్కీ అంతర్గత రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: మరో మహమ్మారి! రష్యా ఏదైనా దాస్తోందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement