అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ..

Mcmahon line: Arunachal an integral part of India, says US - Sakshi

మెక్‌మోహన్‌ రేఖ అంతర్జాతీయ సరిహద్దు 

అమెరికా సెనేట్‌లో తీర్మానం 

భారత్‌కు అండగా ఉంటామన్న సెనేటర్‌ బిల్‌ హగెట్రీ

వాషింగ్టన్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనని వాదిస్తున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్‌ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే తప్ప చైనాలో భాగం కాదని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. చైనా, అరుణాచల్‌ మధ్యనున్న మెక్‌మోహన్‌ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సెనేటర్లు బిల్‌ హగెట్రీ, జెఫ్‌ మెర్క్‌లీ సెనేట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా మరో సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ కూడా దాన్ని ప్రతిపాదించారు.

‘‘స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు చైనా నుంచి ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు అండగా నిలవడం అమెరికా బాధ్యత. ప్రత్యేకించి భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ అని హగెట్రీ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద యథాతథ స్థితిని మార్చాలన్న చైనా కుటిల యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు.

అమెరికా–భారత్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకెళ్లనుందని అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు ‘క్వాడ్‌’ కూటమి మద్దతు ఉంటుందని వెల్లడించారు. సరిహద్దు వెంట వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్‌ భూభాగాలకు మాండరిన్‌ భాషలో మ్యాప్‌లను రూపొందించడాన్ని తీర్మానంలో ప్రస్తావించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top