ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది: మనికే మగే హితె సింగర్‌ యోహానీ

Manike Mage Hithe Singer Yohani Heart Break Over Lanka Situation - Sakshi

ముంబై: శ్రీ లంకలో కొనసాగుతున్న సంక్షోభం.. నెలల తరబడి కొనసాగుతోంది. ధరలు ఆకాశాన్ని అంటడం నుంచి మొదలైన ఆర్థిక సంక్షోభం.. ఇంధన, విద్యుత్‌, నిత్యావసరాల కొరతతో తారాస్థాయికి చేరింది. మరోవైపు ఈ నిరసనలు లంక రాజకీయ సంక్షోభానికి దారి తీశాయి.  అత్యవసర పరిస్థితి.. నిత్యం కర్ఫ్యూలతో అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. 

తన మాతృదేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ యోహాని డిలోక డి సిల్వా స్పందించింది. మనికే మగే హితె సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ 28 ఏళ్ల సింగర్‌ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత భారత్‌ నుంచి ఆమెకు అవకాశాలు రాగా.. ప్రస్తుతం ముంబైలో ఉంటూ ఇక్కడి సంగీతదర్శకులతో పని చేస్తూ.. మరోపక్క మ్యూజిక్‌ షోలు నిర్వహిస్తోంది. శ్రీ లంక సంక్షోభం మొదలయ్యాక.. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఆమెది. ఈ తరుణంలో.. అక్కడి పరిస్థితులపై ఆమె స్పందించింది. 

ప్రస్తుతం నా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. దానికి అందరి సాయం అవసరం. అది ఆర్థిక సాయమే అవ్వాల్సిన అవసరం లేదు. ఏ రూపంలో సాయం అందించినా చాలు.. అంటూ ఆమె ఇక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చింది. నా గొంతు, నాకు దక్కిన పేరు ప్రతిష్టలతో నా దేశానికి సాయం చేయాలనుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో అది ఎంతో ముఖ్యం కూడా. నా దేశం తరపున అంతర్జాతీయ వేదికలపై మౌనం వీడాలనుకుంటున్నా. నా దేశానికి మద్ధతుగా నా గళం వినిపించాలనుకుంటున్నా. అని పేర్కొందామె. 

నా తల్లిదండ్రులు, నా సోదరి, నా స్నేహితులు.. అంతెందుకు నా బృందం మొత్తం అక్కడే ఉంది. వాళ్ల క్షేమం కోరుకోవడం తప్పించి ఇక్కడుండి ఏం చేయలేకపోతున్నాననే బాధ ఉంది. ముఖ్యంగా లంక ప్రజలు పడుతున్న అవస్థల తాలుకా దృశ్యాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. నా దేశ సంక్షేమం కోసం నా గొంతును వినిపించాలనుకుంటున్నా అంటూ ఆమె ప్రకటించింది. ఇదిలా ఉంటే.. లంక కోసం సాయం అందించేందుకు ఆమె విరాళాల సేకరణ సైతం చేపట్టింది.

చదవండి: తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top