ఇది ప్రేమికుల గొడవ లాంటిదే! | Lovers Spat: Israeli Envoy On Trump Iran Ultimatum To Netanyahu | Sakshi
Sakshi News home page

ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!

Jun 9 2026 12:24 PM | Updated on Jun 9 2026 1:00 PM

Lovers Spat: Israeli Envoy On Trump Iran Ultimatum To Netanyahu

నలభై ఏళ్ల స్నేహం.. ఒకరి విజయాలను మరొకరు బహిరంగంగా కొనియాడుకునే అనుబంధం.. కానీ ఇరాన్‌ విషయంలో మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మధ్య విభేదాల మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న నెతన్యాహూను ట్రంప్‌ పదేపదే అప్రమత్తం(వార్నింగ్‌) చేస్తున్నారన్న వార్తలు వెలువడగా.. దీనిని ఇజ్రాయెల్‌ రాయబారి యెచియెల్‌ లీటర్‌ మాత్రం ‘ప్రేమికుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవ’గా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరాన్‌.. ఇజ్రాయెల్‌‌‌‌పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తే వాషింగ్టన్‌ మద్దతును కోల్పోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆప్తమిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

అయితే, యెచియెల్‌ లీటర్‌ ఈ కథనాలను తోసిపుచ్చారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు పరస్పర సహకారంతో జరిగాయని.. మీడియా.. తప్పుదోవ పట్టించేలా కథనాలను అల్లుతుందంటూ ఆరోపించారు. ‘‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి లోతైన స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు (lovers' spat) జరుగుతుంటాయి, అలాగే కొన్నిసార్లు వారి సంభాషణల్లో వాతావరణం కాస్త వేడెక్కుతుందని ఫాక్స్ న్యూస్‌తో  లీటర్‌ వ్యాఖ్యానించారు.

ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నిర్ణయించుకున్నప్పటికీ, తమ దేశంపైకి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను స్పందించకుండా ఇజ్రాయెల్ ఊరికే భరించలేదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ దౌత్యవేత్త పేర్కొన్నారు. చాలా వరకు మేము అమెరికా-ఇజ్రాయెల్ మధ్య చాలా సన్నిహిత, ఉమ్మడి సహకారంతో ముందుకు సాగుతున్నాము. మా మధ్య అద్భుతమైన అవగాహన ఉందన్నారు. 

మరోవైపు, నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇజ్రాయెల్-ఇరాన్ రెండు దేశాలూ దాడులు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. అజ్ఞానం, మూర్ఖత్వం అడ్డురాకపోతే శాంతి దిశగా తుది చర్చలు ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని.. అవసరమైన విధంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ తాను ట్రంప్‌నకు స్పష్టం చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement