Kabul Attack: నా తమ్ముడు చచ్చిపోయాడు.. యుద్ధంతో పాటే..

Kabul Airport Attack: Grief Of 13 US Troops Deceased Families - Sakshi

బొమ్మ తుపాకీతో పహారా కాసేవాడు

మూడు వారాల్లో బిడ్డను చూసుకునేవాడు

చంపేవైపే ఉంటానన్నాడు.. కానీ

నా తమ్ముడు చచ్చిపోయాడు

విషాదంలో మునిగిపోయిన అమర సైనిక కుటుంబాలు

‘‘ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాదే తను జన్మించాడు.. ఈ యుద్ధం ముగిసే దశలోనే తన జీవితం కూడా ముగిసిపోయింది’’- స్టీవ్‌ నికోయి, కాలిఫోర్నియా పోలీస్‌ అధికారి

వాషింగ్టన్‌: స్టీవ్‌ నికోయి గురువారం నుంచి టీవీకే అతుక్కుపోయారు. తన కొడుకు లాన్స్‌ కార్పొరల్‌ కరీం నికోయి గురించి ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆయన గుండె వేగంతో కొట్టుకుంటోంది. ముగ్గురు సైనికులు వచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టగానే విషయం అర్థమైపోయింది. తన కొడుకు ఇక లేడనే మాట నికోయి చెవిన పడింది. కాలిఫోర్నియాకు చెందిన సైనికుడు, 20 ఏళ్ల కరీం నికోయి.. అఫ్గనిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాబూల్‌ పేలుళ్లకు సరిగ్గా ఒక్కరోజు ముందు అఫ్గన్‌ చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ తీసుకున్న వీడియోను ఇంట్లో వాళ్లకు పంపించాడు. అది చూసి ఎంతగానో సంతోషించారు కుటుంబ సభ్యులు. 

కరీం బాగున్నాడు.. త్వరలోనే ఇంటికి వచ్చేస్తాడని భావించారు. కానీ, 24 గంటలు గడవకముందే తమను శాశ్వతంగా వీడి వెళ్లిపోతాడని వారు అస్సలు ఊహించలేదు. ఐసిస్‌ ఖోరసాన్‌ (ఐసిస్‌-కె) గ్రూపు కాబూల్‌లో జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో కరీం నికోయి మృతి చెందాడు. అతడితో సహా 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. వైయోమింగ్‌కు చెందిన లాన్స్‌ కార్పొరల్‌ రిలీ మెకల్లమ్‌(20),  మాక్స్‌టన్‌ సోవియాక్‌(22), కరీం నికోయి(20) పిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. 

యుద్ధంతో పాటే తన జీవితం కూడా..
‘‘ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాదే తను జన్మించాడు.. ఈ యుద్ధం ముగిసే దశలోనే తన జీవితం కూడా ముగిసిపోయింది’’ అని కరీం తండ్రి స్టీవ్‌ నికోయి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2001లో అఫ్గనిస్తాన్‌లో అమెరికా సేనల మోహరింపు నాటి నుంచి ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పనితీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శించారు. అదే విధంగా అఫ్గన్‌లో పనిచేస్తున్న కమాండర్లు ముందే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైతే ఇంతటి దురదృష్టకర ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. తన కొడుకు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: కాబూల్‌ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా!

తండ్రి కాబోతున్నాడనే సంతోషం నిలవలేదు.. 
వైయోమింగ్‌కు చెందిన రిలీ మెకల్లమ్‌ చిన్ననాటి నుంచే సైన్యంలో సేవలు అందించాలని భావించాడు. గతంలో జోర్డాన్‌లో పనిచేసిన అతడు ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో బాధ్యతలు చేపట్టాడు. కాబూల్‌ పేలుళ్లు జరిగినపుడు చెక్‌ పాయింట్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న అతడు మరణించాడు. 

‘‘పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నా సోదరుడు సైనికుడిగా ఉండాలని ఆరాటపడేవాడు. బొమ్మ తుపాకీతో పహారా కాసేవాడు. పింక్‌ ప్రిన్సెస్‌ స్నో బూట్స్‌ ధరించి.. తాను దుండగులను మట్టుపెడతానంటూ తన ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని సంతోషపెట్టేవాడు. మరో మూడు వారాల్లో తనకు బిడ్డ పుట్టబోతోంది. ఒక గొప్ప తండ్రిగా ఉండాలని తను భావించాడు. కానీ అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’’ అని మెకల్లమ్‌ సోదరి ఖియెనె మెకల్లమ్‌ అసోసియేటెడ్‌ ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. ‘‘నచ్చిన పనిచేస్తూ చనిపోయినా ఫర్వాలేదని’’ మెకల్లమ్‌ చెప్పేవాడంటూ అతడి స్నేహితులు గుర్తు చేసుకున్నారు.

ఒకవేళ అదే జరిగితే.. నేను చంపేవైపే ఉంటాను..
మాక్స్‌టన్‌ సోవియాక్‌.. అమరులైన 13 మంది సైనికుల్లో ఒకరు. ‘‘చంపడం లేదా చంపబడటం.. తప్పదు అనుకుంటే.. నేను కచ్చితంగా చంపే వైపే ఉంటాను’’ అంటూ ఇటీవలే తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. యుద్ధం తప్పనిసరైతే ఎంతదాకానైనా వెళ్తానంటూ సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటో షేర్‌ చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ గురువారం నాటి పేలుళ్ల ఘటనలో ఆయన మృత్యువాత పడ్డారు. చిన్న వయస్సులోనే మాక్స్‌టన్‌ ప్రాణాలు కోల్పోవడం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.

నా చిన్నారి తమ్ముడు చనిపోయాడు..
మాక్స్‌టన్‌ మృతిపై స్పందించిన అతడి సోదరి మెర్లిన్‌ సోవియాక్‌ శనివారం ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘‘నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇకపై మాట్లాడను కూడా. కానీ.. ఎంతో అందమైన మనసు కలిగిన, తెలివిగల వాడైన, ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన నా చిన్నారి తమ్ముడు.. ఇతరులు ప్రాణాలు కాపాడే క్రమంలో చనిపోయాడు.

తనొక మెడిక్‌. తోటి వాళ్లకు సాయం చేసేవాడు. తను లేని లోటును మాకు ఎవరు పూడ్చలేరు. మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. తనింకా పిల్లాడే. మా పిల్లలను శవాలుగా మారేందుకే మేం సైన్యంలోకి పంపించామా? మాలాంటి కుటుంబాలు తీవ్ర వేదన అనుభవిస్తున్నాయి. నా గుండె ముక్కలైపోతోంది. వాళ్లు ఇక తిరిగిరారు కదా. అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది’’ అని తమ్ముడితో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను పంచుకున్నారు.

కాగా వీరు ముగ్గురితో పాటు హంటర్‌ లోపెజ్‌, టేలర్‌ హూవర్‌, డియాగన్‌ విలియం- టైలర్‌ పేజ్‌ మరణించిన సైనికుల జాబితాలో ఉన్నారు. అయితే, కాబూల్‌ పేలుళ్లలో మరణించిన సైనికుల వివరాలను అమెరికా రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
-వెబ్‌డెస్క్‌(ది ట్రిబ్యూన్‌, అసోసియేటెడ్‌ ప్రెస్‌ సౌజన్యంతో)
చదవండి: ఐసిస్‌ ఖోరసాన్‌- వీళ్లెంత దుర్మార్గులంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top