నాసాకు తొలి మహిళా చీఫ్‌?

Joe Biden May Pick The First Female Chief Of NASA - Sakshi

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు తదుపరి అధిపతిగా ఒక మహిళ రాబోతుందా? అంటే అవునంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు. జోబైడెన్‌ అధ్యక్షుడిగా పదవి చేపట్టడంతో ఇప్పటివరకు నాసా అధిపతిగా ఉన్న జిమ్‌ బ్రిండెన్‌స్టైన్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. జిమ్‌ స్థానంలో నాసా చీఫ్‌గా ఒక మహిళ ను ఎంచుకోవాలని బైడెన్‌ భావిస్తున్నట్లు సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక తెలిపింది. ఇదే నిజమైతే 1958లో ఏర్పాటైన తర్వాత తొలిసారి నాసాకు ఒక మహిళాధిపతి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం జిమ్‌ స్థానంలో స్టీవ్‌ జుర్‌జెక్‌ను నాసా తాత్కాలిక అధిపతిగా బైడెన్‌ నియమించారు.

మీడియా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే బైడెన్‌ టీమ్‌లో పనిచేస్తున్న ఎల్లెన్‌ స్టోఫాన్, పామ్‌మెల్‌ రాయ్‌ తదితరులు ఈ రేసులో ఉన్నారు. వీరిలో స్టోఫాన్‌ ప్లానెటరీ జియాలజిస్టు, 2013–16లో నాసా చీఫ్‌ సైంటిస్టుగా పని చేశారు. ఇప్పటికే స్మిత్‌ సోనియన్‌ నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియంకు పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సాధించారు. మెల్‌రాయ్‌ యూఎస్‌ వైమానిక దళంలో, నాసాలో పనిచేశారు. టీటీఓ, యూఎస్‌డీఏఆర్‌పీఏ సంస్థలకు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. వీరితోపాటు క్లైమేట్‌ సైంటిస్టు షానన్‌ వాలీ, టెక్నాలజీ అనలిస్టు భవ్యా లాల్, ఆస్ట్రోఫిజిస్ట్‌ జెడిదా ఐలర్‌ పేర్లు సైతం నాసా రేసులో వినిపిస్తున్నాయి. కేబినెట్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించిన బైడెన్‌– హారిస్‌ ప్రభుత్వం ఇదే ధోరణిని నాసాకు కూడా విస్తరించాలని యోచిస్తోందని ప్రముఖ ఆస్ట్రోఫిజిక్స్‌ ప్రొఫెసర్, నాసా ప్యానెల్స్‌లో మెంబర్‌గా పనిచేసిన జాక్‌ బర్న్స్‌ అభిప్రాయపడ్డారు.

నిజానికి నాసాకు ఎప్పుడో మహిళాధిపతిని నియమించాల్సి ఉందన్నారు. నాసా చీఫ్‌గా నియమించే అవకాశాలున్న కొందరి పేర్లను తాను అంచనా వేస్తున్నానని, కానీ ఇప్పుడు బహిర్గతం చేయనని తెలిపారు. ప్రస్తుతం బైడెన్‌ ప్రభుత్వం కరోనా కట్టడిపై అధిక శ్రద్ధ పెడుతున్నందున కొత్త చీఫ్‌ ఎంపిక 2021 మధ్యలో ఉండొచ్చని అంచనా.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top