బొమ్మ తుపాకీ అనుకున్నారు.. షింజో అబే గుండెను చీల్చేసింది

Japan Ex PM Assassination: Bullet Penetrated Shinzo Abe Heart - Sakshi

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో  యావత్‌ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆయనతో అనుబంధం ఉన్న ప్రపంచ నేతలు షాక్‌కు గురయ్యారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో శుక్రవారం ఈ ఘాతుకం జరిగింది. 

ఆదివారం జపాన్‌ పార్లమెంటు ఎగువ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో షింజో అబే మాట్లాడుతుండగా, వెనుకగా వచ్చిన దుండగుడు దేశవాళీ తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా, షింజే అబేపై కాల్పులు జరగడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తపు మడుగులో కుప్పకూలిన అబేను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

దుండగుడు తొలిసారి కాల్చినప్పుడు అందరూ బొమ్మ తుపాకీ కాల్పులు అనుకున్నారట ప్రత్యక్ష సాక్షులు. అప్పటికి షింజో అబే కిందపడిపోలేదని, కానీ రెండో రౌండ్ కాల్చాక ఆయన నేలకొరిగారని ఓ యువతి ఘటన గురించి వివరించింది. రెండో రౌండ్ కాల్చడం స్పష్టంగా కనిపించిందని, తుపాకీ నుంచి నిప్పులు రావడంతోపాటు, పొగ కూడా వెలువడిందని, దాంతో అవి నిజం కాల్పులేనని అర్థమయ్యాయని ఆమె వెల్లడించింది. కిందపడిపోయిన షింజే అబే అచేతనంగా కనిపించడంతో, పలువురు ఆయన ఛాతీపై మర్దన చేశారు.

కాగా, ఓ బుల్లెట్ షింజో అబే గుండెను నేరుగా తాకిందని, దాంతో ఆయన గుండె ఛిద్రమైందని చికిత్స అందించిన డాక్టర్లు వెల్లడించారు. గుండె భాగంలో పెద్ద రంధ్రం పడిందని వివరించారు. ఆయన మరణానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఓ బుల్లెట్ గుండెను తాకగా, మరో బుల్లెట్ ఆ గాయాన్ని మరింత క్లిష్టతరం చేసిందని వివరించారు. 

షింజో అబేను అసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురైన స్థితిలో ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించామని వివరించారు. రక్తం కూడా ఎక్కించామని తెలిపారు. ఏదీ ఫలితాన్నివ్వలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు.

ఘటనాస్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. టెత్సుయా యమగామి(41).. జపాన్‌ సైన్యంలో పని చేసిన వ్యక్తి. తనకు నచ్చని సంస్థతో షింజో అబే సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆయన తీరుపై అసంతృప్తితోనే కాల్చేశానని, రాజకీయ సిద్ధాంతాల పరంగా ఆయనతో ఎలాంటి విబేధాలు లేవని టెత్సుయా యమగామి పోలీసుల ఎదుట స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top