జపాన్ ప్రధాని సనాయే తకైచీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్ల రాజ్యాంగ నియమానికి స్వస్తి పలుకుతూ ఇతర దేశాలకు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, తమ సైన్యం విస్తృత ప్రపంచంతో వ్యవహరించే తీరుపై జపాన్ తన దృక్పథాన్ని మార్చుకునేలా చేశాయి.
అయితే ఆయుధాల విక్రయంలో జపాన్ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తామని ప్రధాని తకైచి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన రక్షణను తాను ఒంటరిగా చూసుకోలేదు. అందుకే ఇతర దేశాల సహకారం కూడా అవసరం’ అని తకైచి పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. రాజ్యాంగ నియమం ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠిన నిషేధాన్ని విధించింది. అయితే మారుతుఉన్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల దృష్ట్యా జపాన్ ప్రధాని సనాయే తకైచి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ ఆయుధ మార్కెట్లో తాము ఏం విక్రయిస్తామనేది అధికారికంగా జాబితాను ప్రకటించనప్పటికీ, ఫైటర్ జెట్‌లు, క్షిపణులు, అత్యాధునిక యుద్ధనౌకలను విదేశాలకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అర్హత సాధించినట్లు జపాన్ మీడియా స్పష్టం చేసింది.
పాత నియమాల ప్రకారం జపాన్ కేవలం నిఘా పరికరాలు, మైన్ స్వీపింగ్ వంటి ప్రాణాంతకం కాని సామగ్రిని మాత్రమే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్‌ల విక్రయానికి సిద్ధమవ్వడం ద్వారా అమెరికా, రష్యా, చైనా వంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.


