డేటా వార్!.. కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్‌ హెచ్చరిక | Iran warns of cutting undersea cables | Sakshi
Sakshi News home page

డేటా వార్!.. కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్‌ హెచ్చరిక

Apr 24 2026 3:34 AM | Updated on Apr 24 2026 5:35 AM

Iran warns of cutting undersea cables

సముద్రంలోని కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్‌ హెచ్చరిక

ఇదే జరిగితే ఆర్థిక, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం 

భారత ఇంటర్నెట్‌ సేవలకు కీలకంగా హార్ముజ్‌ జలసంధి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. పర్షియన్‌ గల్ఫ్‌లోని కీలక డిజిటల్‌ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కారప్స్‌ (ఐఆర్‌జీసీ) బాంబు పేల్చింది. సముద్రంలోని ఈ కేబుల్స్‌ ద్వారానే ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ ప్రయాణిస్తోంది. కేబుల్స్‌కు ముప్పు వాటిల్లితే నష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. చాలా దేశాలు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలుగా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే.  -సాక్షి, స్పెషల్‌ డెస్క్

హార్ముజ్‌ జలసంధి గుండా వెళ్లే కీలక సముద్రగర్భ ఇంటర్నెట్‌ కేబుల్స్‌ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, వాటికి ఉన్న ముప్పును ఐఆర్‌జీసీకి అనుబంధంగా ఉన్న తస్నీమ్‌ వార్తా సంస్థ ప్రచురించిన నివేదికలో వివరించింది. ఇంధన రవాణాకే గాక ప్రపంచ డేటా ప్రవాహానికీ ఈ జలసంధి అత్యంత కీలక మార్గమని స్పష్టం చేసింది. గల్ఫ్‌ దేశాలు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కోసం ఈ సముద్ర కేబుల్‌ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాయని నొక్కి చెప్పింది. 

కేబుళ్ల ల్యాండింగ్‌ స్టేషన్స్, క్లౌడ్‌ హబ్‌లను శత్రువుపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక కేంద్రాలని తెలిపింది. ఎలాంటి అంతరాయం కలిగినా ఆయా దేశాల ఆర్థిక, సమాచార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. గల్ఫ్‌ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉన్నాయి.  

మూల స్తంభాలుగా.. 
ఎర్ర సముద్రం, హార్ముజ్‌ జలసంధి గుండా సముద్రగర్భ ఇంటర్నెట్‌ కేబుల్స్‌ భారీ నెట్‌వర్క్‌ ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కీలక అనుసంధానంగా నిలుస్తుంది. పశ్చిమ దేశాలతో భారత్‌ను అనుసంధానించే ఐదు ప్రధాన సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థలు మన దేశ డిజిటల్‌ కమ్యూనికేషన్లకు మూల స్తంభాలుగా ఉన్నాయి. 

వీటిలో ఫాల్కన్‌ నెట్‌వర్క్, ఆసియా–ఆఫ్రికా–యూరప్‌–1, టాటా టీజీఎన్‌–గల్ఫ్, సౌత్‌­ఈస్ట్‌ ఆసియా–మిడిల్‌ ఈస్ట్‌–వెస్టర్న్‌ యూరప్‌–4, ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–వెస్టర్న్‌ యూరప్‌ ఉన్నాయి. కేవలం ఎర్ర సముద్రం గుండానే 15–20 కేబుల్స్‌ వెళ్తున్నాయి. రిలయన్స్‌ అభివృద్ధి చేస్తున్న ఇండియా–యూరప్‌–ఎక్స్‌ప్రెస్, ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్, గూగుల్‌కు చెందిన ధివారు సముద్ర కేబుల్‌ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. 

సేవలకు అంతరాయం.. 
ఒకటి లేదా రెండు కేబుల్స్‌ దెబ్బతింటే ఆ అంతరాయాన్ని సాధారణంగా సరిచేయొచ్చు. అనేక కేబుల్స్‌ తెగిపోతే ఇంటర్నెట్‌ వేగం తగ్గడం, వెబ్‌సైట్స్‌ పనిచేయకపోవడం, బ్యాంకింగ్, క్లౌడ్‌ సిస్టమ్స్, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన దేశంలోని ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో సుమారు 60% ముంబై నుంచి గల్ఫ్‌ ప్రాంతం మీదుగా యూరప్‌ వైపు వెళ్లే మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. 

మిగిలిన ట్రాఫిక్‌ చెన్నై నుంచి సింగపూర్‌ మీదుగా పసిఫిక్‌ మహాసముద్రం వైపు సాగే మరో మార్గం ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల నుంచి ఆసుపత్రి డేటా వరకు అన్నీ ’క్లౌడ్‌’లో భద్రపరచి ఉన్నాయి. కనెక్టివిటీ పోతే ఈ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. భారత్‌ ఒక ’డిజిటల్‌ ద్వీపం’ లాంటిది. మన అంతర్జాతీయ డేటాలో 97% సముద్ర మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది.  

మరమ్మతులకు నెలలు.. 
తరచుగా నౌకల లంగర్ల వల్ల జరిగే ప్రమాదవశాత్తు నష్టాలు కూడా ఇంటర్నెట్‌ అంతరాయాలకు కారణమవుతాయి. భారీ స్థాయిలో నష్టం జరిగితే వాటిని సరిచేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. 2024, 2025లో ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఎర్ర సముద్రంలోని పలు సముద్రగర్భ కేబుల్స్‌ దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇంటర్నెట్‌ వేగం తగ్గడంతోపాటు అనేక దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఆ ప్రాంతంలోకి ప్రవేశం పరిమితంగా ఉండటం వల్ల మరమ్మతులు చేయడానికి నెలలు పట్టింది.  

రిస్క్‌ అనాలసిస్‌.. 
రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్‌ ఐడియా వంటి టెలికం దిగ్గజాలు తమ అంతర్జాతీయ డేటా ప్రసారం కోసం ఈ హార్ముజ్‌ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపైనే పూర్తిగా ఆధారపడుతు­న్నాయి. హార్ముజ్‌ గుండా వెళ్లే కేబుల్స్‌కు ఎటు­వంటి ముప్పు వాటిల్లకుండా చూడటా­నికి ఇరాన్‌ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరపాలని ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. 

ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో టెలికం శాఖ ఆపరేటర్లందరినీ తమ డేటా మార్గాల భద్రతపై ’రిస్క్‌ అనాలిసిస్‌’ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కేబుల్స్‌ దెబ్బతింటే డేటాను ప్రత్యామ్నాయ మార్గాల (సింగపూర్‌ లేదా పసిఫిక్‌ రూట్‌) ద్వారా ఎలా మళ్లించాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement