breaking news
Cable system
-
‘ఫైబర్‌గ్రిడ్’లో రూ.వేల కోట్ల దోపిడీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించి, దోషుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని మంగళవారం శానస సభలో అధికార వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గత టీడీపీ పాలకులు అస్మదీయ సంస్థలకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టి, రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేబుల్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తాము చెప్పిందే ప్రజలకు టీవీల ద్వారా చూపించాలంటూ నియంతృత్వ విధానానికి తెరలేపారని, గుత్తాధిపత్యం చలాయించాలని చూశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. నెలకు రూ.149కే టీవీ కనెక్షన్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ఇస్తామని ప్రచారం చేసిన టీడీపీ పాలకులు రూ.1,500 కూడా విలువ చేయని సెట్‌టాప్ బాక్సు పేరుతో రూ.4,000 చొప్పున వసూలు చేశారని ధ్వజమెత్తారు. ‘‘అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరులకు చెందిన 4 కంపెనీలకు ఫైబర్ నెట్వర్కు ప్రాజెక్టును అప్పగించారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. దుర్బుద్ధితో సొంత ప్రయోజనాల కోసం ఫైబర్‌గ్రిడ్‌ను వాడుకున్నారు. ఫైబర్‌గ్రిడ్ నిధులను అప్పటి మంత్రి నారా లోకేశ్ రక్తంలా పీల్చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి, అవినీతిని నిగ్గు తేల్చాలి. రివర్స్ టెండరింగ్ విధానంలో ముందుకెళ్లాలి’’ అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా చంద్రబాబు సర్కారు గుత్తాధిపత్యానికి తెరలేపిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుతోపాటు ఇతర వ్యవహారాలపైనా దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. గుంటూరు, నరసరావుపేటలో ‘కే’ (కోడెల) చానల్ అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అవినీతిపై దర్యాప్తు జరిపిస్తాం: మంత్రి గౌతంరెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఎక్కువ ధరకు సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు చేయడం వల్ల రూ.1,000 కోట్లు దుర్వినియోగమైన విషయం వాస్తవమేనని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంగీకరించారు. ఈ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. కాగా, అవినీతి, నియంత పాలన కలిపితే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభివర్ణించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కేసులో నిందితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన సంస్థలకు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారని విమర్శించారు. లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బుగ్గన చెప్పారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సర్కారు హయాంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎలాంటి ప్రణాళిక, ఆలోచన లేకుండా ఎన్నికల ముందు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఈ క్యాంటీన్లు నిర్మించారని తెలిపారు. తెలంగాణలో అన్నపూర్ణ పేరుతో ఇదే తరహా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని, అక్కడ ఒక్కోదానికి రూ.1.50 లక్షలు వెచ్చిస్తే, ఏపీలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిందని విమర్శించారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. -
‘కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని రద్దు చేయాలి’
హైదరాబాద్: వినియోగదారులకు వినోదాన్ని అందించడానికి కృషి చేస్తున్న కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ (టీడీసీఓఎఫ్) అధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడీసీఓఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జగదీశ్వర్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ట్రాయ్ అనే కొత్త టారీఫ్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. దేశంలో 17 కోట్ల టీవీలు ఉంటే 10 కోట్ల బ్రాడ్కాస్ట్, 7 కోట్ల కేబుల్ చానెల్స్ ఉన్నాయని చెప్పారు. ట్రాయ్ విధించిన రూ. 19 గరిష్ట రేటును రూ. 5 లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. 350 చానెళ్లకు కేవలం రూ.250 వసూలు చేస్తున్నామని, ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం రూ.1,000 భారం పడుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేబుల్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని, సీఎం కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బద్రినాథ్ యాదవ్, ఉపాధ్యక్షులు బంగారు ప్రకాశ్ పాల్గొన్నారు. -
పూర్తిస్థాయి కేబుల్ డిజిటైజేషన్‌కు ఐదేళ్లు
హైదరాబాద్: భారత్‌లో కేబుల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటైజ్ చేసేందుకు ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని తెలంగాణ ఎంఎస్‌వో ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.సుభాష్‌రెడ్డి చెప్పారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘4వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్-2015’ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనల వల్ల ఎంఎస్‌వోలకు, కేబుల్ ఆపరేటర్లకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్‌కు సెట్‌టాప్ బాక్స్ పెట్టాలన్నారు. దీని ధర రూ. 1,500 నుంచి రూ. 2 వేల వరకు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు డిజిటైజేషన్ ప్రక్రియ చేరుకోవడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. దేశంలో 25 కోట్లకుపైగా కేబుల్ కనెక్షన్లు ఉన్నాయని, 25 లక్షల టెక్నీషియన్లు ఉన్నప్పుడు డిజిటైజేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఐదు లక్షల మంది టెక్నీషియన్లు కూడా లేరన్నారు. వినియోగదారులకు కావాల్సిన చానళ్లను నాణ్యమైన సిగ్నళ్లతో అందించేందుకు కేబుల్ వ్యవస్థ కృషి చేస్తోందన్నారు. ఎక్స్పో ముగింపు సందర్భంగా.. ఉత్తమ స్టాల్స్ నిర్వాహకులకు, ఎంఎస్‌వోలకు, కేబుల్ ఆపరేటర్లకు జ్ఞాపికలను అందజేశారు.